హోదాపై నామమాత్రంగానైనా మాట్లాడని మోడీ !

Monday, June 10th, 2019, 10:06:06 AM IST

భాజాపా మాట మీదే నిలబడి ఉంది. అయితే అది 2014 ఎన్నికల సమయంలో ఆంధ్రులకిచ్చిన ప్రత్యేక హోదా ఇష్టం అనే మాట మీద కాదు ఎన్నికల తర్వాత నుండి చెబుతున్న హోదా సంజీవని కాదు, హోదా ముగిసిన అధ్యాయం అనే మాటల మీద. గత ఎన్నికల్లో సైతం మోడీ అండ్ కో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పలేదు. దానికి అనుగుణంగానే నిన్న తిరుపతి సభలో మోడీ ప్రసంగం సాగింది. మొదట్లో తిరుపతి సాక్షిగా ఇచ్చిన హోదా మాటను మళ్ళీ తిరుపతిలో మోడీ ప్రస్తావిసారేమోనని జనం ఆశగా ఎదురుచూశారు.

కానీ మోడీ మాత్రం దేశంలో ఆకాంక్షలు పెరిగిపోతున్నాయని, అలా పెరగడం మంచిదేనని, రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని విధాలా సహకరిస్తామని, ఏపీ అన్ని వనరులు ఉన్న రాష్ట్రం కాబట్టి త్వరలోనే నవ్యాంధ్రగా అభివృద్ధి చెందుతుందని అన్నారు కానీ ప్రత్యేక హోదాను ఇస్తాం, కనీసం ఆలోచిస్తాం అనే మాట చెప్పలేదు. దీంతో హోదా ఇచ్చేదిలేదనే అభిప్రాయం మోడీలో ఎంత బలంగా ఉందో తెలిసిపోతోంది. మరి హోదా తప్పక తెస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ నెక్స్ట్ స్టెప్ ఏమిటో చూడాలి.