ఇది బెదిరింపా లేకపోతే సలహానా ?

Monday, June 3rd, 2019, 11:59:18 AM IST

కేంద్రంలో 303 సీట్లతో భాజాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ఎన్డీయే కూటమిలో 350 పైచిలుకు స్థానాలున్నాయి. దీంతో వేరే ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం దిగిరావాల్సిన గత్యంతరం భాజాపాకు కలగలేదు. అయినా దక్షిణాదిన మాత్రం ముఖ్యమైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆ పార్టీ పలుకుబడి సాగే పరిస్తితులు లేవు. అందుకే అయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను గుప్పిట్లో పెట్టుకోవాలని భాజాపా అధిష్టానవర్గం భావిస్తోంది.

ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభివృద్దికి అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పిన మోడీ మెల్లగా రాయబారాలు పంపడం స్టార్ట్ చేశారు. నిన్న హైదరాబాద్ కు కేంద్ర సహాయ మంత్రి రాందాస్ విచ్చేశారు. ప్రత్యేకించి ఏపీ గురించి మాట్లాడిన ఆయన అభివృద్దికి సహకారం ఇస్తామని చెబుతూ జగన్ ఎన్డీయే కూటమిలో భాగమైతే మంచిదని సలహా ఇచ్చారు.

మోడీకి ఎవరి మద్దతు అవసరం లేదు… అయినా జగన్, కేసీఆర్ ఇద్దరూ ఎన్డీయేలో భాగమై మోడీ న్యాయకత్వాన్ని మరింత బలపర్చాలని అంటూ గతంలో చంద్రబాబు మోడీని వ్యతిరేకిస్తే వద్దని చెప్పా.. అయినా వినలేదు. చివరికి ఘోరంగా దెబ్బతిన్నారని గుర్తుచేశారు. ఆయన మాటల్ని వింటే కాసేపు సలహాలా ఇంకాసేపు హెచ్చరికలా అనిపిస్తున్నాయి. మరి వీటి పట్ల జగన్, కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.