మోహ‌న్‌బాబుకు కీల‌క ప‌ద‌వి ఖాయ‌మేనా?

Saturday, June 1st, 2019, 05:57:01 PM IST

ఏపీ ఎన్నిక‌ల వేళ ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై మోహ‌న్‌బాబు వేసిన పంచ్‌లు మామూలుగా పేల‌లేదు. వైస్రాయ్ ఉదంతం నుంచి వెన్నుపోటు రాజ‌కీయాల వ‌ర‌కు, హెరిటేజ్ నుంచి బాబు అక్ర‌మాస్తుల వ‌ర‌కు ఏ విష‌యాన్నీ వ‌ద‌ల‌కుండా జ‌నాల‌కు పూస‌గుచ్చిన‌ట్లు వివ‌రించ‌డంలో మోహ‌న్‌బాబు వంద‌కు వంద శాతం స‌క్సెస్ అయ్యారు. ఎన్టీఆర్ హ‌యాంలో చంద్ర‌బాబు ఏంటి? ఎలాంటి ప‌నుల‌కు అత‌న్ని వాడేవారు?. వాటిని అడ్డంపెట్టుకుని చంద్ర‌బాబు ఎలాంటి ఎత్తులు వేశారు?. న‌మ్మిన ఎన్టీఆర్‌ను నిలువునా ఎలా ముంచారు?. ప‌ద‌వీ వ్యామోహం కోసం ఎంత‌టి దారుణాల‌కు పాల్ప‌డ్డారు వంటి విష‌యాల్ని ఎన్నిక‌ల వేళ జనాల్లోకి తీసుకెళ్ల‌డంలో వైసీపీకి ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది మోహ‌న్‌బాబే.

అందుకే ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి ఇవ్వాల‌ని జ‌గ‌న్ అప్పుడే క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది. రాజ్య‌స‌భ కోటాలో ఆయ‌న‌ను ఎంపీగా పంపించాల‌ని కొంత మంది చెబుతుంటే మ‌రి కొంత మంది ఎమ్మెల్సీని చేసి మీ ప‌క్క‌నే వుంచుకోండ‌ని మ‌రి కొంత మంది చెబుతున్నార‌ట‌. లేదా టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తే మంచిద‌ని కొంత మంది, లేదు క్యాబినెట్ హోదా ఇచ్చి మంత్రిని చేయండ‌ని కొంత మంది చెబుతున్నార‌ట‌. మంత్రి ప‌ద‌వి ఇస్తే రోజుకో పంచాయితీ తెచ్చిపెడ‌తారు. ఏ విష‌యాన్నైనా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు బాహాటంగానే చెప్పేస్తారు. దాంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అందుకే మంత్రిగా కాకుండా ఎంపీ లేదా, ఎమ్మెల్సీని చేస్తే మంచిద‌ని, లేదా టీటీడీ ఛైర్మన్ ప‌ద‌వి ఇస్తే మ‌రీ మంచిద‌ని, ఆయ‌న‌కు దైవ‌భ‌క్తి ఎక్కువ కాబ‌ట్టి అదే స‌రైన నిర్ణ‌య‌మ‌ని అత్య‌ధికులు జ‌గ‌న్‌కు సూచిస్తున్నార‌ట‌. మ‌రి జ‌గ‌న్ మ‌న‌సులో ఏముందో.