1000కోట్ల `మ‌హాభార‌తం` డౌటే?!

Friday, October 12th, 2018, 12:39:31 PM IST

1000 కోట్ల మ‌హాభార‌తం చిక్కుల్లో ప‌డిందా? అంటే అవున‌నే తాజా స‌మాచారం. మోహ‌న్‌లాల్ క‌థానాయ‌కుడిగా శ్రీ‌కుమార్ మేన‌న్ వంటి టాప్ డైరెక్ట‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేసిన సంగ‌తి విధిత‌మే. దుబాయ్‌కి చెందిన బిజినెస్ మ్యాగ్నెట్ బి.ఆర్‌.శెట్టి ఈ చిత్రానికి పెట్టుబ‌డులు స‌మ‌కూర్చనున్నార‌ని అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది. అయితే ఈ ప్రాజెక్టు ఇంత‌కీ మొద‌లు కాదు. అంత‌కీ సెట్స్ పైకి వెళ్ల‌దు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రైట‌ర్ వాసుదేవ‌న్ నాయ‌ర్ టీమ్‌ని సూటిగా త‌న‌దైన శైలిలో ఏకేశారు.

లాల్‌, శ్రీ‌కుమార్ మేన‌న్ త‌దిత‌రులపై ర‌చ‌యిత వాసుదేవ‌న్ నాయ‌ర్ సీరియ‌స్ అవ్వ‌డం తాజాగా సంచ‌ల‌న‌మైంది. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్టును ప్ర‌క‌టించి నాలుగేళ్ల‌యింది. ఇంకా ప్రారంభ‌మే కాలేదు. అస‌లు ఈ సినిమా తీస్తారో తీయ‌రో అడిగేస్తాను!! అంటూ ఎఫ్‌బీలో సీరియ‌స్ అయ్యారు. ఒక‌వేళ తీయ‌క‌పోతే నా స్క్రిప్టు నాకు ఇచ్చేయండి! అంటూ డిమాండ్ చేశాడు. మొత్తానికి 1000 కోట్ల `మ‌హాభార‌తం` సెట్స్‌కెళుతుందా.. వెళ్ల‌దా? అన్న సందిగ్ధ‌త నెల‌కొంది.