కేసీఆర్ దోస్తీ డేంజర్.. జగన్‌కు తెలంగాణ ఎంపీ సజేషన్..!

Tuesday, October 15th, 2019, 09:14:35 PM IST

ఏపీలో ఈ సారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఎన్నికల ముందు నుంచి, నేటి వరకు కేసీఆర్, జగన్‌ల మధ్య మంచి సన్నిహిత్యమే కనబడుతూ వస్తుంది. అయితే తెలంగాణలో చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కట్టడం కావచ్చు, ఆయనపై వ్యక్తిగత కక్ష్య సాధింపు కొరకు కావచ్చు కేసీఆర్ జగన్‌పై మరింత ప్రేమను కురిపిస్తున్నారు. అయితే కేసీఆర్‌తో దోస్తీ మంచిది కాదని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి జగన్‌కు ఈ మేరకు సలహా ఇచ్చారు.

అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్ధతుగా ఇబ్రహీంపట్నం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఎంపీ కోమటి రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వయస్సులో చిన్న వాడైన ఏపీలో జగన్ ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేశాడని ఆయనను చూసి సిగ్గు తెచ్చుకోవాలని మండిపడ్డారు. లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో ఆర్టీసీ విలీనం సాధ్యమైనప్పుడు, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో అది ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ప్రజలలో వైఎస్‌పై ఉన్న అభిమానంతోనే ఆయన లేకున్నా జగన్‌ని సీఎంగా గెలిపించుకున్నారని, కేసీఆర్ సీఎంగా ఉన్నా కూతురునే గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లాంటి వ్యక్తితో స్నేహం చేయడం మంచిది కాదని సీఎం జగన్‌కు కోమటి రెడ్డి సలహా ఇచ్చారు.