ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్.. ఆయనపై నమోదైన కేసులు ఇవే..!

Friday, May 14th, 2021, 10:20:42 PM IST

Raghurama-Krishnam-Raju

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. తన పుట్టిన రోజు వేడుకల కోసం రఘురామకృష్ణంరాజు హైదరాబాద్ వచ్చినట్లు తెలుసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయితే రఘురామ సెక్యూరిటీగా ఉన్న సీఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్‌ను అడ్డుకున్నారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని సీఆర్పీఎఫ్ పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి ఎంపీ రఘురామను అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు ఆయనను విజయవాడకు తరలించారు.

అయితే ఆయనపై ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని IPC-124A, ఇతరులతో కలిపి కుట్ర పనుతున్నారని IPC-120B, ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా వ్యాఖ్యలు చేశారని IPC-153A, వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారని IPC-505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదే కాకుండా రఘురామపై హైదరాబాద్‌లో కూడా ఓ కేసు నమోదైంది. కులం పేరుతో రెడ్లను కించపరిచే విధంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు చేస్తున్నారని, కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టే విధంగా సోషల్‌ మీడియా, టీవీ ఛానళ్లలో మాట్లాడుతున్నారని ఓసీ సంక్షేమ సంఘం మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా ఏపీ సర్కార్‌పై, సీఎం జగన్‌పై ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోరుతూ కూడా రఘురామ పిటీషన్ దాఖలు చేశారు. ఈ నేపధ్యంలో ఆయన అరెస్ట్ ఇప్పుడు రాజకీయంగా చర్చానీయాంశంగా మారింది.