సీఎం జగన్‌కి రఘురామ కృష్ణంరాజు లేఖ.. ఏం కోరారంటే..!

Tuesday, July 14th, 2020, 02:13:08 PM IST

ఏపీ సీఎం జగన్‌కి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. అయితే రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2014-19 మధ్య కాలంలో బిల్డర్స్ నుంచి సంక్షేమ నిధి రూపేణా 13 వందల 64 కోట్లు వసూలు చేసిందని చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పటి వరకు సంక్షేమ నిధి నుంచి 330 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మిగిలిన వెయ్యి కోట్ల నిధుల నుంచి ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి 5 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఇక రాష్ట్రంలో 20లక్షల 64 వేల మంది భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని అందులో 10లక్షల 66 వేల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్‌తో లింక్ చేశారని మిగిలిన కార్మికుల పేర్లను కూడా వెంటనే లింక్ చేయాలని కోరారు.