మద్ధతు ఇవ్వండి.. అన్ని రాష్ట్రాల గవర్నర్లకు ఎంపీ రఘురామ లేఖ..!

Wednesday, June 9th, 2021, 12:20:38 AM IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపధ్యంలో సీబీఐ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనకు మద్ధతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్ధతు కూడగట్టుకునే పనిలో ఎంపీ రఘురామ నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే తన అరెస్ట్‌ తదనంతర పరిణామాలను వివరిస్తూ ఇటీవల ఎంపీలకు లేఖ రాసిన రఘురామ, నిన్న అన్ని రాష్ట్రాల సీఎంలకు కూడా లేఖలు రాసి మద్ధతు కోరారు.

అయితే తాజాగా ఏపీ సహా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు కూడా రఘురామ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ కార్యక్రమాల్లో లోపాలు ఎత్తి చూపినందుకు తనపై సీఎం జగన్ అక్రమ కేసులు పెట్టి వేధించిన విషయాన్ని గవర్నర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ సీబీసీఐడి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి అక్రమంగా తనని అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలించారని, సీఐడి ఏడీజీ సునీల్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు వ్యక్తులు లాఠీలు, రబ్బరు బెల్టులతో తనను చిత్రహింసలకు గురి చేశారని, ఒక సిట్టింగ్ ఎంపీపై దేశద్రోహం నేరం మోపడమే కాకుండా, హింసించడం ఇదే తొలిసారి అంటూ రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకెళ్ళానని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రపతి అధ్యక్షతన త్వరలో జరగనున్న గవర్నర్ల సదస్సులో ఈ అంశాన్ని లేవనెత్తి తనకు మద్దతుగా నిలవాలని, సెక్షన్ 124ఏ రాజద్రోహం కేసును పూర్తిగా రద్దు చేసే విషయంపై చర్చించాలని లేఖ ద్వారా అన్ని రాష్ట్రాల గవర్నర్లకు విజ్ఞప్తి చేశారు.