సీఎం కేసీఆర్ ని విన్నవించుకున్న ఎంపీ రేవంత్ రెడ్డి – కారణాలు ఇవే మరి…?

Wednesday, March 25th, 2020, 11:35:32 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిత్యం తీవ్రమైన విమర్శలు చేసే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, తాజాగా సీఎం కేసీఆర్ కి కొన్ని విన్నపాలతో కూడినటువంటి ఒక లేఖ రాసారు. అంతేకాకుండా మహమ్మారి కరోనా వైరస్ దారుణంగా వ్యాపిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి ఒక కీలకమైన ప్రతిపాదన కూడా చేశారు. కాగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జైళ్లలో ఉన్నటువంటి ఖైదీలను విడుదల చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఎందుకంటే జైళ్లలో ఉంటున్నటువంటి ఖైదీలు కోర్టుకు వెళ్లి వస్తుంటారని, జైలు అధికారులు కూడా జైలుకు, బయటకువెళ్లి వస్తుంటారని, వారి వలన ఖైదీలకు కరోనా సోకె ప్రమాదం ఉందని తన లేఖ ద్వారా వెల్లడించారు.

ఈ మేరకు జైళ్లలో ఉంటున్నటువంటి ఖైదీలను కొన్ని రోజులు విడుదల చేయాలనీ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వాఖ్యానించారు. ఇకపోతే రాష్ట్రంలోని మహిళలు, వృద్ధుల పట్ల సానుకూలంగా స్పందించాలని, అందరికి అవసరమైన సహాయాన్ని కలిసి చేద్దామని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే కరోనా నివారణకై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భేషుగ్గా ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వాఖ్యానించారు.