ఢిల్లీలో మోదీ, గ‌ల్లీలో కేడీ ప్రజలను దోచుకుంటున్నారు – రేవంత్ రెడ్డి

Friday, June 11th, 2021, 08:42:28 PM IST

పెట్రో ధరల పెంపుపై మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. పెట్రోల్ పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న ఎంపీ రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పెట్రో రేట్లు పెంచుతూ పేద‌ల‌ను నిలువు దోపిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 నెల‌ల కాలంలో పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై 26 పెంచారని, వంట గ్యాస్ సిలిండర్ రూ.900కి చేరిందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

అయితే గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తేవట్లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. క‌రోనా సంక్షోభంలో పేద‌ల‌ను ఆదుకోవాల్సిందిపోయి ఢిల్లీలో మోదీ, గ‌ల్లీలో కేడీ ఇద్ద‌రు దోచుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర పెరిగితే ఆ ప్ర‌భావం ర‌వాణా రంగంపై ఉంటుందని దీంతో నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు కూడా పెరిగిపోయాయని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి రూ.6000, ఉచిత బియ్యం పంపిణీ చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.