టీఆర్ఎస్‌లో విబేధాలు.. ఎంపీ రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

Tuesday, June 8th, 2021, 06:02:10 PM IST


తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ఓ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో విభేదాలపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశాడు. ‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’… కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం… యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా…? అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్, మంత్రి జగదీశ్ రెడ్డిలను ఉద్దేశిస్తూ చేసినట్టుగా తెలుస్తుంది.

ఇదిలా ఉంటే గత జనవరిలో మంత్రి జగదీశ్ రెడ్డి తన కుమారుడి పుట్టినరోజు వేడుకలను కర్నాటకలోని హంపీలో జరపగా ఈ వేడుకలకు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కొంతమంది పార్టీ ప్రముఖులు హాజరయ్యారని పత్రికా కథనం తెలిపింది. అయితే పేరుకు పుట్టిన రోజు వేడుకలైనా అక్కడ పార్టీ అంశాలే చర్చకు వచ్చాయని, కేటీఆర్‌ను సీఎం చేయడం, ఈటల కొత్త పార్టీ, మంత్రి జగదీశ్ రెడ్డి పార్టీలో సైలెంట్ అయిపోయారని తదితర అంశాలపై చర్చించినట్టుగా కథనాన్ని రాశారు. అయితే దీని ఆధారంగా ఈటల మాదిరిగానే జగదీశ్ రెడ్డి పని కూడా అయిపోయినట్టే అనే అర్ధం వచ్చేలా రేవంత్ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది.