టీడీపీని పూర్తి స్థాయిలో భూ స్థాపితం చేయాలి – విజయసాయి రెడ్డి

Monday, March 1st, 2021, 07:37:24 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వరుసగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో మరొకసారి వైసీపీ తన హావా కొనసాగించింది. అయితే రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో కూడా విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రచారం లో భాగంగా వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి గ్రేటర్ వైజాగ్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ విశాఖ ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందాలని, అయితే అది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తోనే సాధ్యం అంటూ చెప్పుకొచ్చారు. నాడు మహానేత వైఎస్సార్ తో విశాఖ ప్రగతి సాధిస్తే, మళ్ళీ ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్ చొరవతో అభివృద్ది పథంలో నడుస్తోంది అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే విశాఖ ఉత్తర, తూర్పు నియోజక వర్గాల్లోనీ పలు వార్డుల్లో కన్నబాబు, అవంతి శ్రీనివాస్ లతో విజయసాయి రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ నేతల పై ఘాటు విమర్శలతో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, వంగవీటి రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడు అని, అక్కడి నుండి పారిపోయి వచ్చి విశాఖ ప్రజల పై పెత్తనం చేస్తున్నాడు అంటూ విమర్శించారు. మరో నియోజక వర్గం గంటా శ్రీనివాస రావు ఒక నియోజక వర్గంలో గెలిచి మరొక నియోజక వర్గం కి మారిపోవడమే గానీ, గెలిచిన చోట ప్రజల సమస్యలు పట్టవు అని వ్యాఖ్యానించారు.తమ అభ్యర్ధి కేకే రాజును గెలిపించుకోవాలనీ విజయసాయి రెడ్డి ప్రజలను కోరారు. గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ను గెలిపించి టీడీపీ ను పూర్తి స్థాయిలో భూ స్థాపితం చేయాలి అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.