దారుణం : భార్య పై హత్యాయత్నానికి పాల్పడ్డ ఎంపిడివో – అదనపు కట్నానికి వేధింపులు…

Monday, December 16th, 2019, 11:53:11 AM IST

రోజురోజుకి మహిళలపై దారుణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకవైపు మహిళలపై అత్యాచారాలు చేసి, హత్యలు చేస్తున్న కేసులు నమోదవుతుంటే… ఇక్కడ అదనపు కట్నం తేవాలని తన భార్యనే చంపేయడానికి ప్రయత్నించాడు ఒక అధికారి. కాగా అదనపు కట్నం తేవాలని ఎంపీడీవో గత కొద్దీ రోజులుగా తన భార్యను వేధించడంతో పాటు ఆమెపై హత్యాయత్నానికి ప్రయత్నించిన కారణంగా తనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన జగదీశ్ అనిల్‌కుమార్‌, గుంటూరుకు చెందిన మేరీ కుమారి దంపతులిద్దరూ ఉద్యోగ నిమిత్తం, కాగజ్‌నగర్‌లోని శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే జగదీశ్ ప్రస్తుతం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు (టి) ఎంపీడీవోగా పనిచేస్తున్నాడు.

అయితే గత కొద్దీ రోజులుగా అదనపు కట్నం తేవాలని తన భార్యని తీవ్రంగా వేధిస్తున్నారు. ఎప్పటిలాగే రాత్రి తాగిన మత్తులో వచ్చిన జగదీశ్, తన భార్యతో అదనపు కట్నం కావాలని గొడవకు దిగాడు. అక్కడితో ఆగకుండా ఇంట్లోని కత్తితో భార్యపై దాడికి ప్రయత్నించారు. అయితే ఈ వేధింపులు తాళలేక బాధితురాలు మేరీకుమారి ఎస్పీ మల్లారెడ్డిని కలిసి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.