చరిత్ర సృష్టించిన బ్రిటన్ ఆశాకిరణం

Monday, July 8th, 2013, 02:09:45 PM IST


బ్రిటన్ ఆశాకిరణం ఆండీ ముర్రే చరిత్ర సృష్టించాడు. 77 ఏళ్ల తర్వాత వింబుల్డన్ ట్రోఫీని అందుకున్న బ్రిటన్ ఆటగాడిగా చిరకాల వాంఛను నెరవేర్చాడు. ఇక టాప్‌సీడ్ల మధ్య హోరాహోరీగా జరుగుతుందనుకున్న ఫైనల్ సమరం ఏకపక్షంగా ముగిసింది. వరుస సెట్లలో గెలిచిన ముర్రే.. వింబుల్డన్ ట్రోఫీని తొలిసారి ముద్దాడాడు.

1936లో ఫ్రెడ్ పెర్రీ తర్వాత వింబుల్డన్ గెలిచిన ఇంగ్లీష్ ఆటగాడిగా ఆండీ ముర్రే చరిత్ర సృష్టించాడు ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో 3 గంటల 9 నిమిషాలు సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ ముర్రే 6-4, 7-5, 6-4తో సెర్బియా స్టార్, ప్రపంచ నెంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌ను వరుస సెట్లలో ఓడించి కెరీర్‌లో రెండో గ్రాండ్ స్లామ్ గెలిచాడు

తొలి సర్వీస్ చేసిన జొకోవిచ్ ప్రాంరంభంలోనే తడబడ్డాడు. తొలి రెండు పాయింట్లు కోల్పోయి ముర్రేకి రెండు బ్రేక్ పాయింట్ అవకాశాలిచ్చాడు. చివరికి కోలుకుని తొలి గేమ్ దక్కించుకున్నాడు. అనంతరం మూడో గేమ్‌లో జొకో సర్వీస్‌ను బ్రేక్ చేసి ముర్రే ఆధిక్యం సాధించాడు. అయితే ఆ తర్వాత ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన ప్రపంచ నంబర్‌వన్.. 2-2తో స్కోరు సమం చేశాడు. మరోసారి జొకో సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముర్రే 4-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆతర్వాత సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో సెట్ ముర్రే వశమైంది. ఇక రెండో సెట్‌లో వరుసగా గేమ్‌లు కోల్పోతూ గతేడాది ఫైనల్స్ గుర్తుచేశాడు ముర్రే.

ఇక చివరి సెట్ లో ప్రతిఘటించిన జొకో.. వరుసగా పాయింట్లు గెలిచి మ్యాచ్‌లో నిలిచే ప్రయత్నం చేశాడు. వరుసగా మూడు బ్రేక్ పాయింట్లను సాధించి ముర్రేకి చెమటలు పట్టించాడు. 40-40 పాయింట్ల వద్ద ఆధిక్యం చేతులు మారుతూరాగా.. చివర్లో బ్రిటన్ స్టార్ కొట్టిన వాలీని తిప్పికొట్టే ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయిన జొకో.. బంతిని నెట్‌లోకి కొట్టడంతో వింబుల్డన్‌లో కొత్త చాంపియన్ ఆవిర్భవించాడు