‘కల నిజమాయెగా కోరిక తీరెగా’ అంటున్న ప్రముఖ సంగీత దర్శకుడు!

Friday, February 23rd, 2018, 10:53:34 PM IST

ప్రస్తుతమున్న అగ్ర సంగీత దర్శకుల్లో దేవి శ్రీ ప్రసాద్ తర్వాత మంచి పేరు సంపాదిస్తూ ముందుకు వెళ్తున్నాడు సాయి శ్రీనివాస్ థమన్ శివ కుమార్. అదేనండి మన ఎస్ ఎస్ థమన్. ఒకప్పటి దర్శకులు ఘంటసాల బలరామయ్య గారికి స్వయానా మనవడైన థమన్, శంకర్ తీసిన బాయ్స్ చిత్రంతో మనకు సుపరిచితుడయ్యాడు. అయితే చిన్నప్పటినుండి సంగీతం మీద వున్న మంచి అభిరుచి వల్ల ఒకప్పటి మేటి సంగీత దర్శకులు మణిశర్మ వద్ద శిష్యరికం చేసి చివరకు సంగీత దర్శకుడయ్యారు. ఇప్పటివరకు దాదాపు అందరు అగ్ర నటులకు సంగీతమందించిన ఆయనకు ఒక కోరిక మిగిలి ఉందట. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి పనిచేయాలని.

కాగా ఇన్నాళ్లకు తన కల నెరవేరబోతోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ హీరోగా సినిమా తీయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు పీసీ వినోద్‌ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ప్రాజెక్టు నుంచి అనిరుధ్ తప్పుకొన్నారట. ఇప్పుడు ఆ స్థానాన్ని తమన్‌ భర్తీ చేయనున్నారు. అయితే ఈ సందర్భంగా తమన్‌ ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాకు సంగీతం అందించడం ద్వారా ఎన్నాళ్ళనుండో నేను కన్న నా కల ఇన్నాళ్లకు నిజమయి నా కోరిక తీరుతోందన్నారు.

త్రివిక్రమ్‌ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. నేను ఆయనతో కలిసి పనిచేస్తున్న తొలి సినిమా ఇది. ఇదివరకు ఎన్టీఆర్ తో బృందావనం, బాద్‌షా, రభస సినిమాలకు సంగీతం అందించినప్పటికీ ఈ సినిమా పనులు ఎప్పుడు మొదలు పెట్టాలా అని ఆతృతగా ఉంది అని అన్నారు. అయితే ఈ ఏడాది తమన్‌ స్వరపరిచిన భాగమతి, తొలిప్రేమ చిత్రాల్లోని పాటలకు శ్రోతల నుండి ప్రశంసలు వచ్చాయి. మార్చి చివరి వారంలో త్రివిక్రమ్‌, ఎన్టీఆర్ ప్రాజెక్టు ప్రారంభం కాబోతోన్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో కథానాయిక, ఇతర తారాగణం విషయాలు ఇంకా ప్రకటించవలసి వుంది…