నెట్టింట వైరల్ అవుతున్న మై విలేజ్ షో ఫేం అనిల్ జీల లగ్నపత్రిక..!

Thursday, April 29th, 2021, 06:14:42 PM IST

కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది వివాహాది శుభకార్యాలను వాయిదా వేసుకుటుంటే, మరికొందరు మాత్రం పరిమిత సంఖ్యలో కరోనా నిబంధనలను పాటిస్తూ అనుకున్న ముహూర్తానికే మూడు ముళ్ళ తంతును ముగించేస్తున్నారు. అయితే మై విలేజ్ షో ఫేం అనిల్ జీల మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో పెళ్లి చేసుకోబోతున్నాడు. అందుకు తగ్గట్టుగానే లగ్న పత్రికను కొట్టిచ్చారు. ఎవరి పెళ్లి పత్రికలో అయినా శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు అని రాయించడం చూసుంటాం.. కానీ మనోడి పెళ్లి పత్రికలో మాత్రం శానిటైజర్ ఫస్టు! మాస్క్ మస్టు! సోషల్ డిస్టెన్స్ బెస్ట్! అని రాయించారు.

ఇకపోతే లగ్గం మే నెల 1వ తారీఖు శనివారం పొద్దు పొడిచినంక 8 గంటలకు ఇన్ స్టా లైవ్ లో చూడాలని, వధూవరులకు కరోనా నెగిటివ్ అని తెలపడం, ప్రతి ఒక్కరు అంతర్జాలంలో పెండ్లి చూసి ఆశీర్వదించగలరని, మాకు లైవ్‌లో తలంబ్రాలు పడ్డాక ఎవరింట్లో వాళ్ళు విందు చేయాలని, పెండ్లి తర్వాత బరాత్ కూడా ఉందని, కానీ ఎవరింట్ల వాళ్లు పాటలు పెట్టుకొని ఎగరాలని, ఆ వీడియోలను తమకు పంపితే వాటిని ఒక వీడియో రూపొందించి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తామని తెలిపారు. ఇకపోతే కట్నాలు సమర్పించేవాళ్లు ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా పంపించవచ్చంటూ ఓ క్యూఆర్ కోడ్ ను కూడా అందులో ముద్రించారు. ప్రేమతో మీరు పంపించే మొత్తాన్ని కరోనా కాలంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థిక సాయంగా అందిస్తామని తెలిపారు. అంతేకాదు గిఫ్ట్‌లు ఆర్డర్ చేసేటోళ్లకు అడ్రస్ కూడా ఇచ్చారు. ఇక ఫైనల్‌గా ఈ పెండ్లిని మై విలేజ్ షో టీమ్ లైవ్‌లో కవర్ చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కరోనా కాలంలో లగ్గం పత్రిక అంటూ ముద్రించిన ఈ వెరైటీ పెళ్ళి పత్రిక ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుండడంతో నెట్టింట ఇప్పుడు ఇది తెగ వైరల్ అవుతుంది.