లాక్‌డౌన్ ఆలోచన విరమించుకోండి.. తెలంగాణ సర్కార్‌కి నాగబాబు సజేషన్..!

Wednesday, July 1st, 2020, 03:00:18 AM IST


తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మళ్ళీ లాక్‌డౌన్ వేయాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో దీనిపై తన అధికార యూట్యూబ్ ఛానల్‌లో స్పందించిన నాగబాబు పలు సంచలన ఆరోపణలు చేశారు. అయితే కరోనా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే మాటలకి చేసే పనులకి చాలా తేడా ఉందని, మళ్ళీ లాక్ డౌన్ అంటే అది ప్రభుత్వాల తప్పిదమేనని అన్నారు.

ఒకవేళ లాక్ డౌన్ పొడిగిస్తే మాత్రం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, గత మూడు నెలల లాక్ డౌన్ సమయంలో ప్రజలు తమ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించారని అన్నారు. ఈ సమయంలో ప్రభుత్వాలు చేయాల్సిన పనుల్ని, ప్రజలకు అందించాల్సిన కనీస అవసరాలను విస్మరించిందని అన్నారు. తినడానికి తిండిలేదు, బతుకు గడవడం కష్టంగా మారిపోయిందని ప్రజలు వాపోతుంటే ఇలాంటి సమయంలో మళ్లీ లాక్ డౌన్ అంటే చారిత్రాత్మక తప్పిదం చేసినట్టేనని వ్యాఖ్యానించారు. అయితే లాక్ డౌన్ విధించకుండా కరోనా వస్తే ఎలా ట్రీట్మెంట్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వాలను చాలా మంది విమర్శించినప్పుడు కరెక్ట్ కాదని తానే చెప్పానని, ఇప్పుడు లాక్ డౌన్ పెంచే ఆలోచన ఉంటే విరమించుకోవాలని లక్షలాది మంది ప్రజల పక్షాన తాను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానని అన్నాడు.