ఆహ్వానం స్వీకరించిన నాగ్

Wednesday, October 15th, 2014, 12:31:32 PM IST


భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చ భారత్ కార్యక్రమానికి విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. అయితే కార్యక్రమంలో భాగంగా మోడీ స్వచ్చభారత్ కార్యక్రమానికి 9మందికి ఆహ్వానం పలికారు. కాగా అందులో ఒకరైన రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ స్వచ్చ భారత్ లో పాల్గొని అనంతరం మరికొంత మందికి ఆహ్వానం పలికారు. అలా అనిల్ అంబానీ ఆహ్వానం పలికిన వారిలో మన టాలివుడ్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఉన్నారు. కాగా దీనిపై నాగార్జున తాజాగా స్పందించారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘విదేశీ పర్యటనలలో శుభ్రంగా ఉన్న కొన్ని దేశాలను చూసి ఆశ్చర్యపోతుంటాను. ఇక తాజాగా ప్రధాని మోడీ చేపట్టిన స్వచ్చ భారత్ పిలుపుతో ఇండియా కూడా పరిశుభ్ర దేశంగా అవతరించడానికి మరెంతో కాలం పట్టదు’ అని వ్యాఖ్యానించారు. అలాగే తనకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలికిన అనిల్ అంబానీకి నాగార్జున కృతజ్ఞ్యతలు తెలిపారు. ఇక సాధ్యమైనంత మందిని ఈ స్వచ్చ భారత్ కార్యక్రమానికి భాగస్వాములను చేస్తానని నాగార్జున హామీ ఇచ్చారు.