ధైర్యం సరిపోవడం లేదు.. సాగర్ బైపోల్ ప్రచారంలో కన్నీరు పెట్టుకున్న బీజేపీ అభ్యర్థి..!

Friday, April 2nd, 2021, 05:04:08 PM IST

తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక్కడ నుంచి చాలా మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డి, బీజేపీ అభ్యర్థి రవి కుమార్ నాయక్‌ల మధ్యే పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అన్ని పార్టీలు సాగర్‌లో జెండా ఎగరవేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ నుంచి బరిలో ఉన్న రవి కుమార్ నాయక్ ప్రచారంలో కన్నీరు మున్నీరు అవుతున్నారు.

అయితే నేడు నియోజకవర్గంలోని త్రిపురారం మండలంలోని పలుగ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి పానుగోతు రవికుమార్ నాయక్ పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఎన్నికల్లో పోటీచేస్తున్నా కానీ ధైర్యం సరిపోవడం లేదన్న ఆయన తనకు ఓటు వేయండి అంటూ ప్రజ్ల ముందు కన్నీరుమున్నీరు పెట్టుకున్నారు. అభ్యర్థి విషయంలో చివరి వరకు వేచి చూసిన బీజేపీ ఆశావాహులను కాదని రవి కుమార్‌ నాయక్‌ను బరిలోకి దించింది. దీంతో టికెట్ ఆశించిన ముఖ్య నేతలు పార్టీనీ వీడడం, ఉన్న వారి నుంచి ఎక్కువ మద్ధతు రాకపోతుండడంతో ఆ పార్టీలో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో బీజేపీ అభ్యర్థి రవినాయక్ కన్నీటి పర్యంతం అవ్వడం ఆసక్తిగా మారింది.