నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కారుదే హవా.. తేల్చేసిన ఎగ్జిట్‌పోల్స్..!

Friday, April 30th, 2021, 12:00:18 AM IST

తెలంగాణలో ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుందనేది అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య గెలుపొందారు. అయితే ఇటీవల నోముల అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఏప్రిల్ 17న పోలింగ్ జరగ్గా టీఆర్‌ఎస్‌ నుంచి నోముల భగత్‌, కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి రవి నాయక్‌ పోటీలో నిలిచారు.

అయితే తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని తేల్చి చెప్పేశాయి. ఆరా పోస్ట్ పోల్ సర్వేలో టీఆర్ఎస్ పార్టీకి 50.48 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ 39.93 శాతం, బీజేపీ 6.31 శాతం, ఇతరులు 3.28 శాతం కాగా, మిషన్‌ చాణక్య సర్వేలో టీఆర్‌ఎస్‌కు 49.254 శాతం, కాంగ్రెస్‌ 37.92 శాతం, బీజేపీ 7.80 శాతం, ఇతరులు 5.04 శాతం ఉండగా, ఆత్మసాక్షి సర్వేలో టీఆర్‌ఎస్‌కు 43.5 శాతం, కాంగ్రెస్ 39.5 శాతం, బీజేపీ 14.6 శాతం, ఇతరులు 2.4 శాతం వచ్చినట్టు వెల్లడయ్యింది. అయితే దాదాపు అన్ని సర్వేల్లో టీఆర్ఎస్‌దే పై చేయి కాగా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మే 2న ఈ ఫలితాలు వెలువడనున్నాయి.