హ‌రికృష్ణ మొర‌టోడు అనేసిన‌ బాల‌య్య

Sunday, October 21st, 2018, 11:53:29 PM IST

న‌టసింహా నంద‌మూరి బాల‌కృష్ణ – ఎన్టీఆర్ మ‌ధ్య పొర‌పొచ్చాల గురించి కొన్నేళ్లుగా చ‌ర్చ సాగుతూనే ఉంది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా మాట‌ల్లేవ‌నేది నంద‌మూరి అభిమానుల్లో సాగిన ప్ర‌చారం. ఇరు కుటుంబాల మ‌ధ్య దూరం సాగింద‌ని, జూనియ‌ర్‌ని దూరం పెట్టార‌ని చాలానే మాట్లాడుకున్నారు. అయితే స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు ఆ ఇద్ద‌రినీ క‌లిపేందుకు చంద్ర‌బాబు నాయుడు పెద్ద స్కెచ్ వేశార‌న్న చ‌ర్చ మొద‌లైంది. అందుకు నేడు శిల్ప‌క‌ళా వేదిక లో జ‌రిగిన అర‌వింద స‌మేత స‌క్సెస్ ఈవెంట్ ఆల‌వాలం అయ్యింది.

ఈ వేదిక‌పైకి బాబాయ్ – అబ్బాయ్ వ‌చ్చారు. ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించి నంద‌మూరి అభిమానుల‌కు క‌న్నుల‌పండుగ చేశారు. అబ్బాయ్ సినిమా ఘ‌న‌విజ‌యాన్ని త‌న‌దిగా భావించి బాల‌య్య అర్థ‌గంట‌పైగానే స్పీచ్‌ని ఇచ్చారు. ఈ స్పీచ్‌లో ముఖ్యంగా త‌న అన్న హ‌రికృష్ణ‌పై ఉన్న ప్రేమాభిమానాల్ని బాల‌య్య త‌న‌దైన శైలిలో వ్య‌క్త‌ప‌రిచారు. ముక్కుసూటిగా ఉండే అన్న‌య్య మొర‌టోడు అని బాల‌య్య తెలిపారు. ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం ఆవిర్భ‌వించిన తెలుగు దేశం పార్టీ కి వెన్నంటి నిలిచిన‌ చైత‌న్య ర‌థ సార‌థి నంద‌మూరి హ‌రికృష్ణ జీవితం అర్థాంత‌రంగా ముగిసిపోవ‌డం హృద‌యాన్ని ధ్ర‌వింప‌జేసింద‌ని, త‌న‌ అన్న‌ మొర‌టు మ‌నిషి అయినా వెన్న‌లాంటి మ‌న‌సున్న గొప్ప త‌త్వం ఉన్న‌వాడు అనీ తెలిపారు. నాన్న‌గారి మ‌ర‌ణానంత‌రం హిందూపురంలో అత్య‌ధిక‌ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా అన్న‌య్య హ‌రికృష్ణ చ‌రిత్ర సృష్టించార‌ని అన్నారు. హ‌రికృష్ణ జోహార్, ఎన్టీఆర్ జోహార్ అంటూ బాల‌య్య ఈ వేదిక‌పై నిన‌దించారు. అర‌వింద అని ఆడ‌దాని పేరు పెట్టి విజ‌యం అందుకున్నార‌ని, త‌న సినిమా గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి కి ఓ ఆడ‌దాని పేరు పెట్టుకున్నాన‌ని తెలిపారు. ఆడ‌ది అవ‌స‌రం కాదు.. మగాడిని క‌డుపున మోసి క‌నే అమ్మ‌! అని అన్నారు.