నారా లోకేశ్ జన్మలో సీఎం కాలేడు: ఎంపీ నందిగామ సురేశ్

Thursday, June 6th, 2019, 04:59:56 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గత నెల 30వ తేదిన ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలలో వైసీపీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151 స్థానాలను గెలుచుకోగా టీడీపీ మాత్రం 23 స్థానాలకే పరిమితమైంది. అంతేకాదు 25 పార్లమెంట్ స్థానాలకుగాను వైసీపీ 23 ఎంపీ స్థానాలను గెలుచుకోగా, టీడీపీ కేవలం 3 స్థానాలనే గెలుచుకోగలిగింది. అయితే టీడీపీ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి ఘోర పరాభవాన్ని చవిచూసింది.

అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీనీ నడిపించడం చంద్రబాబుకు కత్తి మీద సాములాంటిదే. అంతేకాదు మంగళగిరిలో అయినా నారా లోకేశ్ గెలిచి ఉంటే పార్టీ బాధ్యతలను లోకేశ్‌పై పెట్టేవాడు చంద్రబాబు. అయితే అక్కడ నారా లోకేశ్ ఓటమి పాలవ్వడంతో ఇప్పుడు పార్టీ బాధ్యతలను లోకేశ్‌కి అప్పచెబితే పార్టీలో మరింత అసంతృప్తి ఏర్పడుతుందని ఉన్న నాయకులు కూడా పార్టీనీ వీడే అవకాశం ఉందని చంద్రబాబు ఆ సాహసానికి సుముఖంగా లేరని అర్ధమవుతుంది. తానే పార్టీ బాధ్యతలను మోస్తూ పార్టీనీ ముందుండి నడిపించాలని చంద్రబాబు డిసైడ్ అయిపోయారట. అయితే ముందు ముందు పార్టీ బాధ్యతలను లోకేశ్‌కి అప్పచెప్పేలా ప్రణాళికలు ఇప్పటి నుంచే సిద్దం చేసుకుంటున్నారట చంద్రబాబు. అయితే వైసీపీ ఎంపీగా బాపట్ల నుంచి గెలిచిన నందిగామ సురేశ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నారా లోకేశ్‌కి పార్టీ బాధ్యతలు అప్పచెప్పినా పార్టీ ఇంకా బలహీనపడుతుందే తప్పా పార్టీనీ ముందుండి నడిపించే సత్తా లోకేశ్‌లో కనిపించడంలేదని ఆయన అన్నారు. అంతేకాదు నారా లోకేశ్ ఈ జన్మకి ఇక ఏపీ సీఎం కాలేరని కూడా ఆయన జోస్యం చెప్పారు.