జైలు పిలుస్తుంది అన్న భయం జగన్ గారిని వెంటాడుతోంది–నారా లోకేష్

Friday, February 14th, 2020, 06:27:20 PM IST

పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారికి లోకమంతా అవినీతి కనబడటంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమి లేదని నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. సాక్షి పత్రికలో వచ్చినటువంటి ప్రకటన ఫై నారా లోకేష్ సెటైర్లు వేశారు. దేశంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఐటీ దాడుల్లో రూ .85 లక్షల దొరికాయని ఐటీ శాఖ అంటుంటే, చంద్రబాబు గారి మాజీ పీఎస్ వద్ద రెండు వేల కోట్ల రూపాయలు దొరికాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని ఘాటు విమర్శలు చేసారు.

రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుంది అన్న భయం జగన్ గారిని వెంటాడుతోంది అని నారా లోకేష్ అన్నారు. అందుకే ఇన్ఫ్రా కంపెనీల్లో జరిగిన ఐటీ రైడ్స్ కి టీడీపీ కి ముడి పెట్టాలని తెగ తాపత్రయ పడుతుంది అని అన్నారు. ఇన్ఫ్రా కంపెనీల్లో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకుంటారు, కానీ ఆ కంపెనీల్లో జరిగిన రైడ్స్ కి, టీడీపీ కి ముడిపెట్టి అసత్య ప్రచారాలని చేస్తున్నారని నారా లోకేష్ అన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి అందరూ తనలాగే జైలుకి వెళ్లాలని కోరుకోవడం సహజమే అని ఆ కోరికలు మాకు లేవని సెటైర్లు వేశారు.