జగన్ గారి మాటలు కోటలు దాటుతున్నాయి.. నారా లోకేశ్ కామెంట్స్..!

Sunday, August 11th, 2019, 11:22:51 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. అయినా కూడా వైసీపీ, టీడీపీ మద్గ్య రోజూ మాటల యుద్ధం పెరిగిపోతూ ఉంది.

అయితే గత కొద్ది రోజుల నుంచి టీడీపీ యువనేత నారాలోకేశ్ వైసీపీ, జగన్‌లపై తన ట్విట్టర్ ద్వారా సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. అయితే తాజాగా మరో సారి వైసీపీ అధినేత సీఎం జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రాయలసీమలో కరువు తాండవిస్తోంది. దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం గత రెండు నెలలుగా ఇక్కడ నమోదు అయ్యింది. సాగు నీరు సంగతి తరువాత, త్రాగు నీరు కూడా లేని పరిస్థితి. ప్రజలు గుక్కెడు నీళ్ళ కోసం, రోడ్డెక్కి ధర్నాలు చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్ గారి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, ప్రజలకు గుక్కెడు నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు. మీ అవగాహనారాహిత్యానికి ప్రజలు ఇంకెన్నాళ్లు ఇబ్బందులకు గురవ్వాలి? ప్రజల పట్ల మరీ ఇంత ఉదాసీనతా? గతంలో ఇలాంటి పరిస్థితి ఉంటే, జలవాణి కార్యక్రమం ద్వారా, ట్రాక్టర్లతో నీటి సరఫరా జరిగేది. మా మీద కోపంతో అది కూడా ఎత్తేసినట్టు ఉన్నారు. అయ్యా జగన్ గారూ! మన నీళ్ళు తెలంగాణాకు తరువాత ఇవ్వచ్చు, ముందు సీమ ప్రజలకు, త్రాగు నీరు ఇవ్వండి అంటూ ఎద్దెవా చేశారు.