జగన్ రాక్షస ఆనందానికి అడ్డు అదుపు లేదు – నారా లోకేశ్

Saturday, October 24th, 2020, 03:37:39 PM IST

ఏపీ సీఎం జగన్ రాక్షస ఆనందానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కూల్చివేతల జగన్ రాక్షస ఆనందానికి అడ్డు అదుపు లేదని, సీఎం స్థానంలో ఉన్న వారికి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కిక్ వస్తుంది. జగన్ రెడ్డికి మాత్రం విధ్వంసం కిక్ ఇస్తుందని ఎద్దేవా చేశారు.

సుదీర్ఘ చరిత్ర ఉన్న గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత రాజకీయ కక్ష సాధింపుకు పరాకాష్ట అని, కరోనా కష్ట కాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సేవలు అందించింది గీతం ఆసుపత్రి. ఎన్నో ఏళ్లుగా విద్యాబుద్ధులు నేర్పి ఎంతో మందిని ఉన్నత స్థానాలకు చేర్చిన గీతం యూనివర్సిటీపై విధ్వంసం జగన్ రెడ్డి నీచ స్థితికి అద్దం పడుతోందని, కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా యుద్ధవాతావరణం సృష్టించారని లోకేశ్ మండిపడ్డారు. మొన్న సబ్బం హరి గారి ఇల్లు, నేడు గీతం యూనివర్సిటీ. పడగొట్టడమే తప్ప నిలబెట్టడం తెలియని వ్యక్తి జగన్ రెడ్డి అని విశాఖలో విధ్వంసం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచెయ్యడమే జగన్ రెడ్డి లక్ష్యమని అన్నారు.