విద్యార్థుల పాలిట జగన్ కంసుడు అని తేలిపోయింది – నారా లోకేశ్

Wednesday, April 28th, 2021, 03:34:15 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని విద్యార్థుల పాలిట జగన్ కంసుడు అని తేలిపోయిందని, క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ద‌శ‌లో కేంద్రం, దాదాపు అన్ని రాష్ట్రాలూ ప‌రీక్ష‌లు ర‌ద్దు, వాయిదా వేస్తే, ఒక్క ఏపీలోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని మొండిగా ముందుకెళ్ల‌డం జ‌గ‌న్‌రెడ్డి మూర్ఖ‌త్వానికి నిద‌ర్శ‌నమని అన్నారు.

విద్యార్థుల భ‌విష్య‌త్తు అంటూ దీర్ఘాలు తీస్తున్న జ‌గ‌న్‌రెడ్డి అధ్వాన‌పాల‌న‌లో వారు బ‌తికి ఉంటే క‌దా భ‌విష్య‌త్తు? అంబులెన్సులు రావు, ఆక్సిజ‌న్ లేదు. జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. క‌రోనా శ‌వాల‌తో మార్చురీలు నిండిపోయాయి, అంత్య‌క్రియ‌ల‌కు శ్మ‌శానాల‌లో క్యూలు, ఆస్ప‌త్రిలో బెడ్డు దొర‌క్క‌ రోడ్డుపైనే కుప్ప‌కూలిపోతున్నారు. ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా ప‌రీక్ష‌ల పేరుతో 15 ల‌క్ష‌ల‌ మందికి పైగా విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడ‌టం ఫ్యాక్ష‌న్ సీఎంకి త‌గ‌దని నారా లోకేశ్ అన్నారు.