క్వారంటైన్ సెంటర్లలో వసతులు శూన్యం.. జగన్ సర్కార్‌పై లోకేశ్ సీరియస్..!

Thursday, July 30th, 2020, 08:37:07 PM IST


ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ప్రస్తుత పరిస్థితులపై స్పందించిన నారా లోకేశ్ జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. జగన్ గారి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని, కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే బాధేస్తుందని అన్నారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగి బాత్ రూంలో పడి చనిపోయిన ఘటన తీవ్రంగా కలిచివేసిందని అన్నారు.

అయితే కరోనాని ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ఈ ఒక్క సంఘటన ద్వారా తెలుస్తుంది. క్వారంటైన్ సెంటర్లలో వసతులు శూన్యం, ఆసుపత్రుల్లో సరైన వైద్యం కూడా అందడం లేదని, అనునిత్యం కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బంది రోడ్ల మీదకి వచ్చి నాణ్యమైన పీపీఈ కిట్లు ఇవ్వాలి అంటూ ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. కరోనా మీకు పెద్ద విషయం కాకపోవచ్చు జగన్ రెడ్డి గారు! కానీ ప్రజల ప్రాణాలు విలువైనవి అని అన్నారు.