రోడ్లపై ప్రజల ప్రాణాలు పోతుంటే ప్యాలెస్‌లో మీకు నిద్ర ఎలా పడుతుంది – నారా లోకేశ్

Thursday, April 29th, 2021, 04:54:07 PM IST

Lokesh

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించలేక చేతులెత్తేస్తున్నారు. బెడ్లు లేవు, ఆక్సిజన్ కొరత. మీ పాలనలో కనీసం పార్థివదేహాన్ని తీసుకెళ్లే దిక్కుకూడా లేదు. రోడ్లపై ప్రజల ప్రాణాలు పోతుంటే ప్యాలెస్‌లో మీకు నిద్ర ఎలా పడుతుంది జగన్ గారు అని లోకేశ్ ప్రశ్నించారు.

వ్యవస్థలను గాలికొదిలి గాలి కబుర్లు చెబుతూ ఎంత కాలం నెట్టుకొస్తారని, రోజుకి నాలుగు ఘటనలు జరుగుతున్నా నిద్రలేవకపోతే ఎలా? మరో పక్క ప్రైవేట్ దోపిడీ. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని నారా లోకేశ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగిన ఘటన గురించి వినగానే కన్నీరు ఆగలేదు. ఆ కుటుంబం ఉన్న చోట మనం ఉంటే ఏంటి అని ఒక్క సారి ఆలోచించండి జగన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ అనుమతిలో ప్రభుత్వ జాప్యం, డబ్బు కోసం ప్రైవేట్ ఆసుపత్రి ఒత్తిడి కలిసి ఒక ప్రాణాన్ని నడి రోడ్డు మీద బలిగొన్నాయని, అంజలి గారి మృతి బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సత్వర చర్యలు తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.