ఎన్నాళ్లీ ప్ర‌తీకార పాల‌న.. జగన్ సర్కార్‌పై నారా లోకేశ్ సీరియస్..!

Tuesday, June 8th, 2021, 05:16:03 PM IST


జగన్ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధూళిపాళ్ల న‌రేంద్ర గారు ఛాలెంజ్ చేసిన‌ట్టే, సంగం డెయిరీలో మొలిచిన గ‌డ్డి కూడా పీక‌లేక‌పోయిన అమూల్‌ రెడ్డి.. కోవిడ్ గైడ్‌లైన్స్ అన్నీ పాటించి నిర్వ‌హించిన సంగం డెయిరీ డైరెక్ట‌ర్ల స‌మావేశంలో కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని త‌ప్పుడు కేసు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనంద‌య్య‌ని అన‌ధికారికంగా బందీ చేసి, మందుని వెబ్‌సైట్‌లో పెట్టి అడ్డంగా అమ్ముకుందామ‌నే బ్లీచింగ్ రెడ్డి ప్లాన్‌ని బ‌ట్ట‌బ‌య‌లు చేశార‌నే క‌క్ష‌తో సోమిరెడ్డి గారిపై మ‌రో త‌ప్పుడు కేసు బ‌నాయించారు. క‌క్ష‌తో ర‌గిలిపోతూ, ప‌గ సాధిస్తూ ఎన్నాళ్లీ ప్ర‌తీకార పాల‌న జగన్ రెడ్డి అని ప్రశ్నించారు.

అయితే ప్ర‌శ్నించేవారిపై ఫేక్ కేసులు బ‌నాయించాల‌ని ఫేక్ సీఎం ఒత్తిడి చేస్తే, ఉన్న‌త చ‌దువులు చ‌దివి రాజ్యాంగం, చ‌ట్టం, రూల్ ఆఫ్ లా తెలిసిన పోలీసుల బుద్ధి ఏమైంది అని లోకేశ్ నిలదీశారు. అన్యాయ‌మైన కేసులు, అక్ర‌మ అరెస్టులు చేసి న్యాయ‌స్థానాల్లో దోషులుగా నిల‌వ‌డానికి పోలీసుల‌కు సిగ్గు అనిపించ‌క‌పోవ‌డం విచార‌క‌రమని అన్నారు. కోవిడ్ గైడ్‌లైన్స్ ప్ర‌కారం కేసు పెట్టాల్సి వ‌స్తే, ప్ర‌తీరోజూ మాస్కు వేసుకోకుండా అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తోన్న మూర్ఖ‌పు ముఖ్య‌మంత్రిపై రోజుకో కేసు న‌మోదు చేయాలని, వైసీపీ ఎమ్మెల్యేలు నిర్వ‌హిస్తున్న ర్యాలీల‌పై కేసులు బుక్ చేయాలి, గ‌న్‌మెన్‌తో బూట్లు మోయిస్తూ, బ‌హిరంగ స‌భ నిర్వ‌హించిన గిద్ద‌లూరు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి, నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన అధికారులపైనా, పాల్గొన్న వారి పైనా కేసులు పెట్టాలని లోకేశ్ అన్నారు.