దేశానికి ప్ర‌ధాని, రాష్ట్రానికి సీఎం ఎలాగో పంచాయ‌తీకి స‌ర్పంచూ అలాగే – నారా లోకేశ్

Saturday, April 3rd, 2021, 06:30:32 PM IST


ఏపీలో మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ సర్పంచులు, వార్డు మెంబర్లు నేడు ప‌ద‌వీ ప్ర‌మాణ‌స్వీకారం చేయనున్న సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వారికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. గాంధీజీ క‌ల‌లుగ‌న్న గ్రామ‌స్వ‌రాజ్య సాధ‌కులుగా నేడు ప‌ద‌వీ ప్ర‌మాణ‌స్వీకారం చేస్తోన్న పంచాయ‌తీ స‌ర్పంచులు, వార్డు మెంబ‌ర్లు అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నానని అన్నారు.

అయితే అరాచ‌క‌పాల‌న‌లో ఎల‌క్ష‌న్ కాకుండా ఫ్యాక్ష‌న్ మార్క్ సెల‌క్ష‌న్‌ని ఎదిరించి మ‌రీ పోటీచేసి, గెలుపొందిన మీరు మా అంద‌రికీ స్ఫూర్తి. దేశానికి ప్ర‌ధాని, రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి ఎలాగో పంచాయ‌తీకి స‌ర్పంచూ అలాగే అని, ఏ ఒత్తిడికీ త‌లొగ్గ‌కుండా ప‌నిచేయండని సూచించారు. కేంద్రం నుంచి నేరుగా పంచాయ‌తీల‌కే నిధులొస్తాయని, నిధులు స‌ద్వినియోగం చేసుకుని గ్రామాలలో అభివృద్ధికి పాటుప‌డండని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి ఆద‌ర్శంగా నిల‌వండి, మీ ప‌ద‌వీకాల‌మంతా సాఫీగా సాగుతూ ప్ర‌జాభిమానం చూర‌గొనాల‌ని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.