ఏపీ సీఎం జగన్‌కి ఐదు డిమాండ్లు వినిపించిన నారా లోకేశ్.. ఏమిటంటే?

Sunday, May 16th, 2021, 12:32:37 AM IST

ఏపీ సీఎం జగన్‌కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరో లేఖ రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు అనుస‌రించిన డిజిట‌ల్ వేల్యూష‌న్‌పై అభ్య‌ర్థులు వ్య‌క్తం చేస్తోన్న అనుమానాలు నివృత్తి చేయాల‌ని సీఎం జగన్‌కి లేఖ రాశారు. పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన సక్రమంగా జరగలేదనే ఫిర్యాదులు అనేకం వచ్చాయని, ఎంపిక విధానం గతంలో జరిగిన ప్రక్రియకు విరుద్ధంగా ఉందని అన్నారు. ఎలాంటి అధ్యయనం లేకుండా డిజిటల్ వేల్యూష‌న్‌ని ఎంచుకోవటం అనేక విమర్శలకు తావిస్తోందని, మాన్యువల్ వేల్యూష‌న్ చేయ‌డం కోసం రూపొందించిన జవాబు పత్రాలను డిజిటల్ పద్దతిలో చేయటం వల్ల అర్హులైన వారు నష్టపోయే ప్రమాదం ఉందని లోకేశ్ అన్నారు.

అంతేకాదు వచ్చే నెలలో ఇంటర్వ్యూ రౌండ్ ప్రారంభం కానున్నందున అభ్యర్థుల తరఫున 5 డిమాండ్లను జగన్ రెడ్డి గారి ముందు ఉంచుతున్నానని అందులో మొదటిది మెయిన్స్ జవాబు ప‌త్రాల‌ను మాన్యువ‌ల్ వేల్యూష‌న్‌ చేయాలని, రెండవది ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లు, అంద‌రి అభ్యర్థుల మార్కులను వెల్లడించాలని, ఇది వారి తదుపరి ప్రయత్నం కోసం, లోపాలు సరిచేసుకునేందుకు ఉపయోగపడుతుంది. మూడవది డిజిటల్ వేల్యూష‌న్‌కి సంబంధించిన సాంకేతికత SOP పై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, నాల్గవది ఎంపిక చేయని అభ్యర్థులందరి మార్కులు, వారి జ‌వాబు ప‌త్రాల‌ను విడుదల చేయాలని, ఐదవది ఎంపిక ప్రక్రియ, వేల్యూష‌న్‌పై అనుమానాలున్న‌వారి ఫిర్యాదులు స్వీక‌రించేందుకు ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.

కోవిడ్-19 వైర‌స్ సాకుతో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో నిర్మాణాత్మక, విధానపరమైన, చట్టపరమైన ప‌ద్ధ‌తుల‌ను విస్మ‌రించ‌డం త‌గ‌దని, ముందుగా ఎటువంటి స‌న్నాహాకాలు జ‌ర‌గ‌కుండా అమ‌లుచేసిన‌ డిజిటలైజేషన్ విధానం అభ్యర్థులకు శాపం కాకూడదని నారా లోకేశ్ అన్నారు.