చండీయాగానికి భక్తులతో పాటు.. నేతల తాకిడి..!

Saturday, December 26th, 2015, 01:38:06 PM IST

chandi

తెలంగాణా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ అయుత చండీయాగాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాగానికి రాష్ట్రంలోని ప్రముఖ వేదపండితులు, ఋత్వికుల సమక్షంలో ఈనెల 23 నుంచి 27 వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ చండీయాగంలో ఇది నాలుగో రోజు. ఇకపోతే, ఈ యాగానికి ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్ దేశంలోని ప్రముఖ వ్యక్తులను, వివిధ పార్టీల రాజకీయ నాయకులను ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు ఇప్పటికే అనేక మంది నేతలు మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న చండీయాగానికి హాజరయ్యారు.

ఇకపోతే, ఈ యాగానికి నాయకులతోపాటు.. సామాన్య ప్రజలు సైతం రావొచ్చు. చండీదేవి ఆశిస్సులు తీసుకోవచ్చు. ఇక, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు, ప్రజలు ఈ యాగాన్ని చూసేందుకు తరలి వస్తున్నారు. వరసగా సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఇక, ఈరోజు ఉదయం ఏపి, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు, తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఎన్ సిపీ అధ్యక్షడు శరత్ పవార్ తదితరులు యాగానికి హాజరయ్యారు.