ప్రత్యేక హోదా పై గళం విప్పిన నటుడు!

Monday, February 5th, 2018, 11:45:29 AM IST

ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా అనేది అయిపోయిన అంశమని, ఇక వదిలేయమని అధికార పార్టీ నేతలు ఎంత చుపుతున్నా వైసిపి నేత జగన్, జనసేన అధినేత పవన్ హోదా వల్ల ప్రయోజనాలు ప్రజలకి తెలియ చెప్పాలని, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని తమ గళం వినిపిస్తున్న విషయం విదితమే. అయితే జగన్ మాత్రం చంద్రబాబు రాష్ట్ర పరువుని కేంద్రం లో తాకట్టు పెట్టారని, ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఏమి ఉపయోగం ఉండదని విమర్శలు చేయడం చూస్తున్నాం. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై నటులు శివాజీ కూడా తన వంతుగా స్పందిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి నిరాశే ఎదురవడంతో నటుడు నిఖిల్ తన వంతుగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని, అది ప్రత్యేక హోదాతో పాటు కేంద్రం నిధుల వల్ల మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. కొందరు తనను ‘నీకు ఏపీకి ప్రత్యేక హోదా’ లాంటి విషయాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అయితే కొన్ని ప్రత్యేకమైన విషయాలపై స్పందించడానికి కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కానక్కర్లేదని నిఖిల్ అభిప్రాయపడ్డారు.

ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, కేంద్ర నుంచి రాష్టానికి ప్రత్యేక సాయం అందాలన్నా, ఏపీలో మరింత అభివృద్ధి జరగాలన్నా హోదాతోనే సాధ్యమవుతుందని తెలుసుకున్నాను అని ఆయన తెలిపారు. తెలుగు వ్యక్తిగా, ఓ భారతీయుడిగా అభివృద్ధి కోరుకుంటున్నానని, కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ నిధులు వచ్చినప్పుడే ఏపీలో అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని ఆయన అన్నారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఫొటోను పోస్ట్ చేశారు. ఆయన నటించిన నూతన చిత్రం కిర్రాక్ పార్టీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలయిన ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది….