వాట్సాప్ లో త్వరలో మరొక అద్భుత ఫీచర్!

Wednesday, February 7th, 2018, 03:48:56 PM IST

సోషల్ మీడియా మన జీవితం లో ఒక భాగంగా మారిపోయింది. అందులోనే మూడొంతుల జీవితం గడుపుతున్న వారున్నారు కూడా. అయితే మరీ ముఖ్యంగా వాట్సాప్ ప్రస్తుతం మన జీవితం లో గుడ్ మార్నింగ్ తో నిద్ర లేపడం నుండి మళ్లి పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పేవరకు ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు నూతన ఫీచర్లు అందిస్తున్న వాట్సాప్ సంస్థ , మరొక అద్భుత ఫీచర్ ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటివరకు మనం వాట్సాప్ ద్వారా ఒకే వ్యక్తికి వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ చేసుకునే సౌలభ్యం వుండేది. గ్రూప్ లు క్రియేట్ చేసుకుని వాడుతున్న వాళ్లలో ఒక అసంతృప్తి వుంది. అదేంటంటే ఒకేసారి అందరికి వాయిస్ కాల్, లేక వీడియో కాల్ చేసే సదుపాయం వేదని. అయితే ప్రస్తుతం వాట్సాప్ సంస్థ ఈ నూతన ఫీచర్ ని అందుబాటు లోకి తెచ్చే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక వేళ ఈ ఫీచురే కనుక లాంచ్ అయితే ఒకరి కంటే ఎక్కువ మందితో ఆడియో లేదా వీడియో కాల్ చేసుకోవచ్చని, గ్రూప్ క్రియేట్ చేసిన అడ్మినిస్ట్రేటర్ గా వున్న వ్యక్తికి గ్రూప్ లోని అందరికి కాల్స్ చేసే వీలుంటుందని ఆ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ప్రస్తుతానికి ఇది బీటా వెర్షన్ వాడుతున్న కొందరికి మాత్రమే అందుబాటులో ఉన్నట్లు, త్వరలోనే అందరికి ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అలానే వాట్సాప్ లో ఎవరికైనా వాయిస్ కాల్ చేసినపుడు దానిని వీడియో కాల్ గా మార్చే ఫీచర్ పై కూడా ఆ సంస్థ టెస్టింగ్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదే మనం ఎవరికైనా వీడియో కాల్ చేసినపుడు మనకున్న మొబైల్ నెట్ సిగ్నల్ స్ట్రెంగ్త్ ను బట్టి అది వాయిస్ కాల్ కి మారడం మనకు తెలిసిందే…