నెక్లెస్ రోడ్ మళ్లీ తళతళ..!

Monday, September 15th, 2014, 04:44:47 PM IST


ప్రేమ పక్షులకు నిలయంగా, హుస్సేన్ సాగర్ కి మణిహారంగా నిలిచే నెక్లెస్ రోడ్ మరింత అందంగా కన్పించబోతోంది.తలుక్కున మెరిసే రోడ్లు, గ్రీనరి తో తెలంగాణ అధికార పండుగ బతుకమ్మకు ముస్తాబవుతోంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు వేదికైన పీపుల్స్ ప్లాజా సైతం… ఇప్పుడు తెలంగాణ సాంప్రదాయ నృత్యాలకు, వేడుకలకు మరోసారి రెడీ అంటోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న భాగ్యనగర మణిహారం నెక్లెస్ రోడ్ ఇక అందరి దృష్టిని ఆకర్షించబోతోంది.

ఇకపై సాగర్ తీరంలో సేదతీరేందుకు వచ్చే పర్యాటకులకు నెక్లెస్ రోడ్ మరిన్ని అందాల్ని పంచబోతోంది. నిన్నా, మెన్నటి వరకు గతుకుల రోడ్లు, బురద గుంటలతో అడుగే నరక ప్రాయంగా మారిన నెక్లెస్ రోడ్డు పర్యాటకులకు రెడ్ కార్పొట్ పరవనుంది. ఇందుకు సంబంధించి హెచ్ఎండీఏ యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపడుతోంది.

133 కేవీ, 33 కేవీ విద్యుత్ కేబుళ్లను రోడ్డు భూగర్భ మార్గం ద్వారా వేశారు. దీంతో ఈ రోడ్లన్ని గతుకుల మయంగా మారాయి. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ రోడ్డు అభివృద్ధి ప్రణాళికతో పాటూ.. నెక్లెస్ రోడ్ సుందరీకరణ చేపట్టింది. ఈ రోడ్డు మరమత్తులకు గానూ.. ట్రాన్స్ కో, ససీడీసీ ఎల్ శాఖలు HMDA కు 3.3 కోట్లు నష్ట పరిహారం చెల్లించాయి. ఇందులో భాగంగా ఇందిరా పార్క్ రోటరీ నుంచి, సంజీవయ్య పార్క్ వరకు దాదాపు 4.2 కిలో మీటర్ల రోడ్డు పునః నిర్మాణం సాగుతోంది.

రోడ్డు నిర్మాణ పనులే కాకుండా.. సుందరీకరణే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా సైకిల్ ట్రాక్ ను నిర్మించనున్నారు. ఇక సాగర్ ప్రక్షాళన సైతం వేగంగా సాగుతోంది. ఇప్పటికే బాలానగర్, జీడిమెట్ల కర్మాగారాల నుంచి వచ్చే రసాయన పదార్థాలను హుస్సేన్ సాగర్ లో కలువకుండా నిలువరించేందుకు ప్రణాళికలు రచించారు. కాగా, ఈ నెల 24 న ప్రారంభం కాబోయే తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలకు నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ వేదికగా నిలువబోతోంది. దీంతో అధికార పండుగకు అన్ని ఏర్పాట్లు చేసేలా ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నారు. పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ మార్గంలో అంబరాన్నంటే వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం సైతం ఉవ్విలూరుతోంది. అయితే తెలంగాణ ప్రధాన పండుగ బతుకమ్మకు ముందే నెక్లెస్ రోడ్ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.

నెక్లెస్ రోడ్ కు నూతన అందాలు తేవడం సంతోషంగా నగర వాసులు చెబుతున్నా.. ఈ అభివృద్ధి ప్రణాళిక సాగర్ కే పరిమితం కాకూడదని విశ్లేషకులు భావిస్తున్నారు. సాగర్ కు పర్యాటకుల సంఖ్య పెరగాలంటే.. నెక్లెస్ రోడ్డే కాదు.. చుట్టూ పరిసర ప్రాంతాలు, బస్తీలు పరిశుభ్రంగా ఉంచాలని చెబుతున్నారు.

మొత్తానికి కొత్త రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు సాగర్ తీరం సర్వంగా సుందరంగా ముస్తాబవుతోంది. అయితే ముస్తాబు మున్నాళ్ల ముచ్చట కాకుండా… నగర రూపురేఖల్ని మార్చేలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.