ఇదేం మార్పు: కొత్త జిల్లాలు తెచ్చిన తంటా?

Tuesday, May 1st, 2018, 01:54:22 AM IST


ఏ ప్రాతిప‌దిక లేకుండా ఏపీ-తెలంగాణ‌ను విభ‌జించిన‌ట్టే, తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల్ని విభ‌జించారా? అంటే అవుననే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. టీ-స‌ర్కార్ చేసిన ఈ ప‌నికి జిల్లాల్లో కేసీఆర్‌పై మండిప‌డుతున్న స‌న్నివేశం ఉంది. ప్రతి ప్రభుత్వ విభాగం, ఆర్‌బిఐ వంటి స్వయం ప్రతిపత్తి సంస్థలకు ప్రతులు అందేలా చేశారు. అయితే ఈ హడావుడిలో కొన్ని గ్రామాలను విస్మరించారు. దీపం లేని గ్రామాల పేర్లను చేర్చలేదు. జిల్లా యంత్రాంగంతో సంబంధం లేకుండా సచివాలయంలో కూర్చుని జిల్లాలు, మండలాల హద్దులు నిర్ణయించడంతో పాటు ఏ మండలం పరిధిలో ఏ గ్రామాలు ఉండాలనేది రెవెన్యూ అధికారులే ప్రతిపాదనలు సిద్ధం చేయ‌డంతో పెద్ద గంద‌ర‌గోళ‌మే నెల‌కొంది.

జిల్లా కలెక్టర్ల అభిప్రాయం తొలుత తీసుకున్నప్పటికీ, మార్పులు చేర్పుల సమయంలో మళ్లీ సంప్రదించకపోవడం మూలంగా అనేక సమస్యలు తెరమీదికి వచ్చాయి. జిల్లాలు ఏర్పడి, పాలన ప్రారంభమైన తరవాత సమస్యలు ఒక్కొక్కటిగా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. తమ గ్రామం ఏ మండలం పరిధిలో లేదని కొందరు, తమ గ్రామానికి దగ్గరగా ఉన్న మండలంలో చేర్చలేదని కొందరు, పాత మండలంలోనే కొనసాగించాలని ఇలా పలు ఫిర్యాదులు అందాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల నుంచి ఎక్కువగా విజ్ఞప్తులు వచ్చాయి. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నాగిరెడ్డిపెట మండలం గ్రామాలను మెదక్ జిల్లాలో కలపాలని, గట్టుప్పల్‌ను మండల కేంద్రంగా ప్రకటించాలని విజ్ఞప్తులు అందాయి. మహబూబ్‌నగర్‌లో నారాయణపేట, ఖమ్మంలోని భద్రాచలం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని స్థానిక ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. ఈ విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తిరస్కరించింది. పరిస్థితులు యధాస్థితికి రావడంతో రెవెన్యూ శాఖ ఊపిరి పీల్చుకున్నది. తప్పులు దొర్లిన వాటికి సవరణలు ఇచ్చి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాలు కొలువుదీరి ఏడాదిన్నర దాటుతున్నా ఇంత వరకు మ్యాపులను ఖరారు చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తున్నది. అన్నీ సవ్యంగా ఉన్నందున మ్యాపులను సిద్ధం చేసి ఆవిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాగా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లా మ్యాపులను ఆవిష్కరించేందుకు పెద్దగా శ్రద్ద చూపించడం లేదు. సీఎం కోరితే తప్ప వాటి జోలికి వెళ్లకూడదనే భావనలో ఉన్నట్లు సమాచారం. మ్యాపులకు సీఎం ఆమోదం తెలిపితే అధికారికంగా విడుదల చేసి, అన్ని ప్రభుత్వ శాఖలకు పంపిస్తారు. మొత్తానికి కొత్త జిల్లాలు ప్ర‌భుత్వానికి ఇలా కొత్త ప‌ని పెట్టాయ‌నే భావించాలి.

  •  
  •  
  •  
  •  

Comments