కొత్త మున్సిపల్ చట్టం తొందర్లోనే రానుందా…?

Sunday, September 22nd, 2019, 08:46:27 PM IST

తెలంగాణ లో రెండవసారి అధికారాన్ని దక్కించుకున్నటువంటి తెరాస ప్రభుత్వం రాష్ట్ర పాలనా విషయంలో ఎక్కడ కూడా రాజి పడకుండా ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి దిశగా పక్కా ప్రణాళికలతో దూసుకుపోతున్నారు. కాగా ఈమేరకు రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీ చట్టాన్ని ఏర్పాటు చేశామని, కాగా ఆ చట్టం చాలా కఠినంగా ఉంటుందని పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ అధికారికంగా వెల్లడించారు. కాగా ఈ చట్టం ప్రకారం ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా సహించేది లేదని, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోని మరీ వారిని శిక్షిస్తామని కేటీఆర్ వెల్లడించారు. కాగా ఈమేరకు కేటీఆర్ మాట్లాడుతూ… మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పనితీరుపై అధ్యయనం చేసి చర్యలు తీసుకోడానికి ప్రతి 3 నెలలకోసారి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కమిటీని రూపొందించామని వెల్లడించారు కేటీఆర్.

అంతేకాకుండా ఈ కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారం 75 గజాలలోపు స్థలాలు ఉన్నవారు తమ ఇంటిని నిర్మించుకోడానికి ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ వెల్లడించారు. కాకపోతే ఆపైన గజాల స్థలం ఉన్నవారు ఆన్లైన్ లో అనుమతి తీసుకోవాలని, అదికూడా అన్ని నిశితంగా పరిశీలించాకే వారికి 21 రోజులలో అనుమతిని ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రం మొత్తంలో అధిక సంఖ్యలో ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఒకవేళ ఈ నిబంధనల్ని ఎవరైన అధిగమిస్తే వారిపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.