ఆర్టీసీ బస్సులో కొత్త పైరసి సినిమా ప్రదర్శన?

Monday, April 16th, 2018, 02:39:06 PM IST

ఇదివరకు అక్కడక్కడ ఆర్టీసీ బస్సుల్లో కొత్త సినిమాల ప్రదర్శన జరిగిన ఘటనలు జరగడం చూసాము. అయితే ప్రస్తుతం అటువంటి ఘటన మరొకసారి వెలుగులోకి వచ్చింది. యువ హీరో నాని నటించిన కొత్త సినిమా కృష్ణార్జున యుద్ధం ఒక ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారు. ఈ విషయమై ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఒకయువకుడు ఏకంగా మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయడం ద్వారా ఘటనను వెలుగులోకి తెచ్చాడు. విషయంలోకి వెళితే, బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న గరుడ బస్సులో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారంటూ టీవీ స్క్రీన్‌షాట్‌ను కేటీఆర్‌కు పంపించాడు. ప్రభుత్వ సంస్థల్లోనే ఇలాంటి పైరసీ జరిగితే, ఇక పైరసీ నియంత్రించాలని సామ్యానుడిని ఎలా అడుగుతారని ప్రశ్నించాడు.

సునీల్ ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్, ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎండీని కోరారు. అయితే ప్రభుత్వ బస్సుల్లోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటే, ఇక ప్రైవేట్ బస్సులు మాత్రం ఎందుకు ఇలా చేయకుండా వుంటారు అని కొందరు విమర్శలు సంధిస్తున్నారు. నాని ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వారం రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం వైపుగా దూసుకెళుతోందని చిత్ర వర్గాలు అంటున్నాయి….