హైదరాబాద్ నగర శివారులోని మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలో బీ ఫార్మసీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసకుని విచారణ చేపడుతున్న పోలీసులు అసలు వాస్తవాలను వెలికి తీస్తున్నారు. అసలు ఆ యువతి కిడ్నారాంపల్లి ఆర్ఎల్ నగర్‌కు చెందిన యువతి కాలేదని, అత్యాచార ప్రయత్నం చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదనే నిర్దారణకు పోలీసులు వచ్చారు.
అసలు ఏం జరిగిందంటే రాంపల్లి ఆర్ఎల్ నగర్‌కు చెందిన బీఫార్మసీ చదువుతున్న యువతి బుధవారం కాలేజీ నుంచి ఇంటికి తిరిగి రావడం ఆలస్యం కావడంతో ఆమె తల్లి ఆమెకు తరుచూ ఫోన్ చేయసాగింది. దీంతో ఆమె తనను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు సమాచారాన్ని తల్లికి చెప్పింది. కంగారుపడిపోయిన యువతి తల్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో యువతి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమెను పోలీసులు ట్రేస్ చేశారు. అన్నోజిగూడ ఓఆర్ఆర్ వద్ద యువతిని గుర్తించి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి తనపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు తెలిపింది.
దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఘటన జరిగిన సమయంలో ఆటో డ్రైవర్ల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఘటన జరిగినట్టుగా చెప్పబడుతున్న ప్రాంతంలో లేవని గుర్తించిన పోలీసులు, యువతి చెప్పిన విషయాలపై అనుమానం రావడంతో ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను మరోసారి పరిశీలించారు. అయితే యువతి బుధవారం సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికి రాకుండా ఘట్కేసర్, యంనంపేట్, అన్నోజీగూడ ప్రాంతాల్లో ఒంటరిగా సంచరిచినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే పోలీసులు యువతిని మరోసారి ప్రశ్నించగా ఇంటికి రావడం ఆలస్యం అయ్యిందని తల్లి పదే పదే ఫోన్ చేస్తుండటంతో ఆటో డ్రైవర్ కిడ్నాప్‌కి పాల్పడినట్టు చెప్పాడని యువతి పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం.
అయితే యువతికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మాత్రం అత్యాచారం జరిగినట్టుగా తేల్చారు. అసలు యువతి కిడ్నాప్ జరగనప్పుడు వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్టు ఎందుకు నిర్ధారణ అయ్యింది? ఆమె ఇంటికి రాకుండా యువతి ఒంటరిగా ఎందుకు రోడ్లపై సంచరించింది? ఎందుకు ఆ యువతి ఆటో డ్రైవర్లు తనను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు చెబుతుంది? అన్న వాటిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. అయితే బుధవారం సాయంత్రం యువతి ఆటో ఎక్కి రాంపల్లి వరకు వెళ్లి అక్కడ బైక్‌పై ప్రియుడితో కలిసి వెళ్లిందని, ఆ తర్వాత అతని ఇద్దరు సోదరులతో కలిసి గంజాయి సేవించిందని అనంతరం వారు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసులో నిజానిజాలను పోలీసులు త్వరలోనే బయటపెట్టనున్నారు.