అయోమయంగా ‘చేపమందు’ పంపిణీ కార్యక్రమం

Thursday, June 6th, 2013, 04:24:11 PM IST


చేపమందు ప్రసాదాన్ని స్వీకరించేందుకు ఇతర రాష్ర్టాల నుంచి ప్రజలు హైదరాబాద్ కు తరలివస్తున్నారు. ఓ వైపు చేపమందు పంపిణీ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని లోకాయుక్త స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద అయోమయం నెలకొంది. దీంతో వసతులు, ఏర్పాట్ల విషయంలో పనులు మందకొడిగా సాగుతున్నాయి.

హరినాథ్‌ గౌడ్‌ పంపిణీ చేస్తున్న చేపల మందుపై రాష్ట్ర లోకాయుక్త సీరియస్‌గా స్పందించింది. ప్రసాదం అంటూ ఒక ప్రైవేటు సంస్థ చేపడుతున్న కార్యక్రమానికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై లోకాయుక్త నిలదీసింది. రాష్ట్ర బాలల హక్కుల సంఘం సభ్యుడు అచ్యుత్‌ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం లోకాయుక్త విచారణ చేపట్టింది. మంతిని హరినాథ్‌ గౌడ్‌ పంపిణీ చేస్తున్న చేపల ప్రసాదం హాస్తమా రోగులకు శాస్ర్తీయంగా ఎలాంటి ప్రభావం చూపడం లేదని ఆధారాలు చూపుతున్న ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని లోకాయుక్త తప్పుపట్టింది.

ప్రభుత్వ సహాకారానికి బ్రేక్
గతంలో జనవిజ్ఞాన వేదిక కూడా ఈ ప్రసాదాన్ని పంపిణీ చేయకూడదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిందని ఈ సందర్భంగా లోకాయుక్త దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ, జిల్లా కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమాన్ని లోకాయుక్త తప్పపడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్‌ వ్యక్తులు నిర్వహిస్తున్న అంశంగా గుర్తించి ప్రభుత్వం సహాయాన్ని ఆపి వేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తిక నాడు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌడ్స్‌లో పంపిణీ చేసే కార్యక్రమానికీ ప్రభుత్వం నుంచి సహాకారాన్ని ఆపు చేయాల్సిందిగా లోకాయుక్త సుభాషణ్‌రెడ్డి ఆదేశాలను జారీ చేశారు.