జ్యూట్‌బ్యాగ్‌తో వెళితే బంగారు కానుకలు!

Thursday, June 6th, 2013, 12:10:18 AM IST


మీరు రైతుబజార్‌కు వెళ్తున్నారా? అయితే జ్యూట్ బ్యాగుతో వెళ్లండి. లక్ష రూపాయల విలువైన బంగారు కానుకల్ని అందుకోవచ్చు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా 40 మైక్రాన్లకన్నా తక్కువ మందం ఉండే ప్లాస్టిక్‌ను నిషేధించాలని హెచ్‌ఎంసీ మరోసారి నిర్ణయించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించేవారిపై ఈనెల 15 నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ విషయమై వినియోగదారులను ప్రోత్సహించే క్రమంలో.. డిస్కౌంట్లు కూడా ఆఫర్ చేస్తోంది.

40 మైక్రాన్ల కన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్‌ను ఉపయోగించరాదనే నిబంధనను కఠినతరం చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ అధికారుల సమాయత్తమవుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం నగరంలో 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉండే ప్లాస్టిక్‌ను ఏడాది క్రితం పూర్తిగా నిషేధించారు. నిషేధం అమలు ఆవశ్యకతపై నగరంలోని స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులతో గ్రేటర్ యంత్రాంగం ఎప్పటికప్పుడు సమావేశమవుతోంది. అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ఈ క్రమంలో.. ఏదైనా షాపింగ్ మాల్ లేదా రైతుబజార్లకు వెళ్ళే వినియోగదారులు.. తమ వెంట జ్యూట్ లేదా గుడ్డ సంచిని తీసుకువెళ్తే ప్లాస్టిక్ కవర్ కు అయ్యే మొత్తాన్ని బిల్లులో మినహించాలని నిర్ణయించారు.

జ్యూట్‌బ్యాగ్‌లను ప్రోత్సహించేందుకు.. వీలైతే కూకట్‌పల్లి రైతుబజార్ తరహాలో కూపన్లు ఇచ్చి లక్కీడ్రా వంటివి కూడా నిర్వహించనున్నారు. కూకట్‌పల్లి రైతుబజార్‌లో ఓ స్వచ్ఛంద సంస్థ జ్యూట్ బ్యాగ్ లను ప్రోత్సహించేందుకు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. బుధవారం నుంచి అమలులోకి వచ్చిన ఈ కార్యక్రమంలో భాగంగా రైతు బజార్‌కు వచ్చే వినియోగదారులు సొంతంగా జ్యూట్ లేదా గుడ్డ సంచులు వెంట తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న వారికి ఓ కూపన్ ఇస్తారు. 40 రోజుల తరవాత లక్కీ డ్రా నిర్వహించి.. ముగ్గురు విజేతలకు లక్ష రూపాయలు విలువ జేసే బంగారు ఆభరణాలు ఇస్తారు. ఇందులో ప్రథమ బహుమతి 50 వేలు, ద్వితీయ బహుమతి 30 వేలు, తృతీయ బహుమతి కింద 20వేల విలువైన బంగారాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఒకవేళ పరిసర ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్ యజమానులు కోరితే కూపన్ల బాక్స్‌ను అక్కడ కూడా ఏర్పాటు చేస్తామని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

మరోవైపు 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్‌ క్యారీబ్యాగ్‌లు తయారు చేసే సంస్థలపై జిహెచ్ఎంసి అధికారులు విస్తృత దాడులకు సమాయత్తమవుతున్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం మొదటిసారి రెండు వేల రూపాయలు, రెండోసారి10వేలు జరిమానా విధించాలని నిర్ణయించారు. మూడోసారి కూడా తప్పుచేస్తే ట్రేడ్‌లైసెన్సును రద్దుచేసి, దుకాణం మూసేయాలని గ్రేటర్ అధికారులు నిర్ణయించారు.

ప్లాస్టిక్ నిషేధంపై గత ఏడాది జూన్ 30న ఉత్తర్వులు జారీచేసిన జీహెచ్‌ఎంసీ తొలినాళ్ళలో కొద్దిరోజులు హడావుడి చేసి.. ఆ తర్వాత నిర్లక్ష్యం వహించింది. తాజాగా మరోసారి వారు హడావుడి చేసేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీకి ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.