కేసీఆర్: మనసులోని మాట బయటపెడతారా?

Friday, June 7th, 2013, 10:00:34 PM IST


తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కార్యకర్తల శిక్షణా తరగతలు పేరుతో జిల్లాలన్నీ చుట్టి వస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ ఏదో చోట కార్యక్రమం నిర్వహించి అక్కడ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో జరిగిన పలు శిక్షణా తరగతుల్లో టీఆర్ఎస్ అధినేత స్వయంగా హాజరై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై కార్యకర్తలు, పార్టీ ముఖ్యనేతలతో సమాలోచనలు జరుపుతున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతారని అంతా భావిస్తున్న ఆయన సొంత నియోజకవర్గం మెదక్ లో మాత్రం కొంతకాలంగా పర్యటించడంలేదు. ప్రస్తుతం పాలమూరు పార్లమెంట్ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో మెదక్ నుంచి బరిలో ఉంటారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం ప్రస్తుతం ఈ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ విజయశాంతికి స్థానచలనం తప్పకపోవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మెదక్ సీటు తాను మరెవరి కోసమో వదులకోనని గతంలోనే స్పష్టం చేశారు విజయశాంతి.

వచ్చే ఎన్నికల్లో మెదక్ నుంచే కేసీఆర్ పోటీ ఉంటుందన్న నేపధ్యంలో ఆయన ఈ నియోజకవర్గ పరిధిలో ఎప్పుడు పర్యటిస్తారు.. పర్యటిస్తే కార్యకర్తలకు ఎలాంటి కబురు చెబుతారనే ఆసక్తి ఇటు రాజకీయవర్గాలతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ నెలకొంది. మెదక్ పార్లమెంట్ నియోజకర్గాల పరిధిలో పర్యటిస్తే.. ఆయన ఖచ్చితంగా తన మనసులోని మాటను బయటపెడతారన్నది పార్టీ వర్గాల మాట. అదే జరిగితే అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయి. విజయశాంతి పరిస్థితి ఏంటీ అన్నదానిపైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో సొంత సీటులో తప్ప మిగతా జిల్లాలన్నీ చుట్టి రావాలని భావిస్తున్న కేసీఆర్.. మొదటగా ఆ పని పూర్తి చేస్తున్నారన్న ప్రచారమూ సాగుతోంది. మరి గులాబీ బాస్ మెదక్ లో ఎప్పుడు పర్యటిస్తారో.. పర్యటించినప్పుడు తాను పోటీ చేయబోయే సీటుపై స్పష్టత ఇస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.