నిఖిల్ కి నిర్మాతతో చెడిందా..?

Wednesday, November 16th, 2016, 04:52:55 PM IST

nikhil
వరుస విజయాలతో ఊపుమీద ఉన్న యువహీరో నిఖిల్ కు శంకరాభరణం పరాజయం తో బ్రేక్ పడ్డట్లు అయింది.ఆ చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో మనముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ లు మంచి ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. దీనితో చిత్రంపై మంచి అంచనాలే నెలకొని ఉన్నాయి.కానీ నిఖిల్ గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం ప్రమోషన్ అంత జోరుగా సాగడం లేదు. దీనికి కారణం నిఖిల్ కు, చిత్ర నిర్మాత పి.వి. రావు కు మధ్య విభేదాలు తలెత్తాయని ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది.

నిఖిల్ చిత్రంపై ఆసక్తిని కనబరుస్తున్నా..నిర్మాత మాత్రం చిత్ర ప్రమోషన్ విషయంలో ఆసక్తిగా లేడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పెద్దనోట్ల రద్దు వ్యవహారంతో ఆర్ధిక ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ తరుణంలో చిత్రానికి మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆ ప్రభావం చిత్ర వసూళ్ల పై పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చిత్రం శుక్రవారం విడుదలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది.