భాజాపాపై పగ తీర్చుకున్న నితీశ్ కుమార్ ?

Monday, June 3rd, 2019, 02:01:08 PM IST

రెండు రోజుల క్రితం జరిగిన కేంద్ర మంత్రివర్గ ఏర్పాటు పూర్తిగా మోడీ, అమిత్ షాల అభీష్టం మేరకే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మంత్రివర్గంలో తమకూ చోటు దక్కుతుందని జెడీయూ నేతలు భావించారు. కానీ వారి ఆశలు ఫలించలేదు. జెడీయూ నేత ఒకర్ని కూడా మంత్రువర్గంలోకి తీసుకోలేదు. దీంతో జెడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. బహిరంగంగా చెప్పకపోయినా తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని నొచ్చుకున్నారు.

భాజాపా చర్యకు ప్రతిగా తన మంత్రివర్గ విస్తరణలో ఎన్డీయే కూటమిలోని భాజాపా, ఎల్.జే.పీలను పక్కనబెట్టి తన పార్టీకి చెందిన 8మందికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో భాజాపా నేతలు నొచ్చుకున్నా పైకి మాత్రం మేమంతా ఒక్కటే అంటూ చెప్పుకుంటున్నారు. సీనియర్ నేత సుశీల్ కుమార్ అయితే ఒక మంత్రి పదవి ఇస్తామని చెప్పినా తామే వద్దన్నామని అన్నారు.

కానీ రాజకీయవర్గాలు మాత్రం కేంద్రంలో భాజాపా అధికారంలో ఉంది కాబట్టి మంత్రివర్గంలో తమకు రెండు లేదా అంతకంటే ఎక్కువ పదవులు దక్కుతాయని ఆశించారని, కానీ నితీశ్ ఒకటి ఇస్తామనడంతో నిరుత్సాహపడి ఆ ఒక్కటీ ఎందుకని ఊరుకున్నట్టు చెబుతున్నారు.