నైజాం మెగాస్టార్‌కి సిస‌లైన పోటీ

Tuesday, July 24th, 2018, 09:16:42 PM IST

నైజాంలో పెద్ద స్థాయి హీరో నితిన్‌. అత‌డిని నైజాం మెగాస్టార్ అని అభిమానులు పిలుచుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వ‌ద్ద అసాధార‌ణ వ‌సూళ్లు తేగ‌లిగే స‌త్తా ఉన్న హీరోగా అత‌డు నిరూపించుకున్నాడు. అయితే కెరీర్ ప‌రంగా కొన్ని త‌ప్పిదాలు నితిన్‌ని బ్యాక్ బెంచీకే ప‌రిమితం చేస్తున్నాయి. అత‌డి కెరీర్ ఒక‌డుగు ముందుకు, రెండ‌డుగులు వెన‌క్కి అన్న‌ట్టే ఉంది. రీసెంటుగానే నితిన్ న‌టించిన లై చిత్రం ఫ్లాప‌వ్వ‌డంతో మార్కెట్ వ‌ర్గాల్లో గురి త‌ప్పుతోంది. ఆ క్ర‌మంలోనే నిర్మాత దిల్‌రాజుతో క‌లిసి శ్రీ‌నివాస క‌ళ్యాణం చిత్రానికి ప్లాన్ చేశాడు తెలివిగా. శ‌త‌మానం భ‌వ‌తి ఫేం స‌తీష్ వేగేష్న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఆగ‌స్టు 9న రిలీజవుతోంది. ఈ ఆదివారం ఈ సినిమా టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు. టీజ‌ర్ రిలీజై ఇప్ప‌టికి 10ల‌క్ష‌ల వ్యూస్‌ని సాధించింది.

అయితే ఆ మ‌రుస‌టి రోజే మ‌రో నైజాం హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గీత గోవిందం టీజ‌ర్ రిలీజైంది. ఈ టీజ‌ర్ రిలీజైన కేవ‌లం 18 గంటల్లోనే 28ల‌క్ష‌ల వ్యూస్ సాధించ‌డం చూస్తుంటే నితిన్‌ని మించి దేవ‌ర‌కొండ హ‌వా ఇక్క‌డ సాగుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. కెరీర్‌లో అప‌జ‌యం ఎరుగ‌ని హీరోగా దూసుకెళుతున్నాడు విజయ్ దేవ‌ర‌కొండ‌. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, మ‌హాన‌టి .. ఇవ‌న్నీ వ‌రుస‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్లు. ఆ క్ర‌మంలోనే అత‌డికి యూత్‌లో అసాధార‌ణ క్రేజు పెరిగింది. ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో నితిన్ త‌న కెరీర్‌లో కీల‌క‌మైన విజ‌యాలు అందుకుని త‌న గ్రాఫ్‌ని పెంచుకోవాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments