నితిన్‌తో ఛ‌లో అంటాడా?

Wednesday, June 6th, 2018, 11:53:34 AM IST


సినీప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రికో ఎన్నో అవ‌కాశాలు ర‌క‌ర‌కాలుగా వ‌స్తుంటాయి. కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా ఛాన్స్ క‌ష్ట‌మే. కొంద‌రు ల‌క్కీగా ఆరంభ‌మే అవ‌కాశం అందుకుని ల‌క్కీగా తొలి విజ‌యం అందుకుని, అటుపై వెంట వెంట‌నే ప్రాజెక్టుల్ని ప‌ట్టాలెక్కించేస్తుంటారు. ఈ రెండో కోవ‌కు చెందిన ద‌ర్శ‌కుడిగా వెంకీ కుడుముల‌ను ఉద‌హ‌రించ‌వ‌చ్చు. ఈ యంగ్ డైరెక్ట‌ర్ తొలుత అంద‌రిలానే కృష్ణాన‌గ‌ర్ క‌ష్టాలు అనుభ‌వించాడు. అటుపై చాలా త‌క్కువ స‌మ‌యంలోనే అత‌డు ద‌ర్శ‌కుల‌తో సాన్నిహిత్యం సంపాదించుకున్నాడు. అందుకు వారితో స‌రైన క‌మ్యూనికేష‌న్ మెయింటెయిన్ చేయ‌డం బ‌ర్త్‌డే కేక్‌లు తినిపించ‌డం త‌నకు క‌లిసొచ్చింద‌ని ఇదివ‌ర‌కూ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు.

ఇక‌పోతే వెంకీ కుడుముల తొలి చిత్రం ఛ‌లో బంప‌ర్ హిట్‌. ఈ సినిమా నాగ‌శౌర్య‌కు పున‌ర్జ‌న్మ‌లాంటిదే. అందుకే ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు వినిపించిన క‌థ‌కు నితిన్ ఓకే చెప్పాడుట‌. ఆగ‌ష్టులో శ్రీ‌నివాస క‌ళ్యాణం రిలీజ‌వ్వ‌గానే వెంకీతో మొద‌లెట్టేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు నితిన్‌. న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల్ని ఎంక‌రేజ్ చేసే నితిన్ ఈసారి వెంకీకి అవ‌కాశం ఇచ్చాడు కాబ‌ట్టి ఈ ల‌క్కీ ఛాన్స్‌ను అత‌డు సద్వినియోగం చేసుకునేందుకు శ‌త‌ధా ప్ర‌య‌త్నిస్తున్నాడుట‌. ఆగ‌ష్టులోనే నితిన్ – వెంకీ సినిమా సెట్స్‌కెళ్లే చాన్సుంద‌ని తెలుస్తోంది.