`రోబో -2` ఇంకా ఎందుకిలా అవుతోంది!?

Friday, May 4th, 2018, 10:29:30 PM IST

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – శంక‌ర్ క‌ల‌యిక‌లోని `రోబో` సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. ఆ సినిమా ప‌లుమార్లు వాయిదాల న‌డుమ రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. అయితే ఈసారి అంత‌కు నాలుగు రెట్లు వాయిదాల ప‌ద్ధ‌తిలో `రోబో 2` (2.ఓ) రిలీజ‌య్యే స‌న్నివేశం క‌నిపిస్తోంది. ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ అంకాన్ని గ‌ట్టెక్కే ప‌రిస్థితి క‌న‌బ‌డ‌డం లేదు. అంతేకాదు అస‌లు ఈ సినిమా రిలీజ్ తేదీ ఎప్పుడు? అన్న‌దాంట్లో ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. 2019 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ‌వుతుందా? అవ్వ‌దా? అన్న‌దానిపైనా ఏమాత్రం స్ప‌ష్ఠ‌త లేదు.

అయితే ఇలా ఎందుకు జ‌రుగుతోంది? అంటే బాలీవుడ్ హంగామా ఇచ్చిన వివ‌రం ప్ర‌కారం.. ఇప్ప‌టికే గాడి త‌ప్పిన వీఎఫ్ఎక్స్ ప‌నుల్ని తిరిగి స‌వ్యంగా పూర్తి చేసేందుకు అమెరికా కంపెనీకి శంక‌ర్ కొంత గ‌డువు ఇచ్చాడుట‌. ప్ర‌స్తుతం స‌ద‌రు కంపెనీ వీఎఫ్ఎక్స్ ప‌నుల్లో చేసిన త‌ప్పిదాన్ని స‌రిదిద్దుకునే ప‌నిలో ఉంది. అయితే ఈ ప‌ని పూర్త‌వ్వ‌డానికి ఇంకా కొన్ని నెల‌లు ప‌డుతుంద‌ని తెలుస్తోంది.ఇక అత్యంత కీల‌క‌మైన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు ఇప్ప‌టికీ మొద‌లు కాలేదు. ఇందులో మిక్సింగ్ వ‌ర్క్ కూడా ప్రారంభం కాలేదు. 3డి ఎఫెక్ట్స్‌కు సంబంధించిన ప‌నులు మాత్రం జూన్‌-జూలై నాటికి పూర్తి కానున్నాయ‌ని చెబుతున్నారు. ఆగ‌ష్టు నాటికి ఈ ప‌నుల‌న్నిటినీ పూర్తి చేసి, ఎట్టి ప‌రిస్థితిలో ప్ర‌మోష‌న్ ప్రారంభించాల‌ని శంక‌ర్ బృందం భావిస్తోంది. ఆ మేర‌కు డెడ్‌లైన్లు విధించినా .. ప‌నులు మాత్రం అనుకున్నంత సాఫీగా సాగ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే రిలీజ్‌ ఎంతో ఆల‌స్య‌మైంది. ఇంకా ఇంకా ఆల‌స్య‌మ‌వుతుందా? అన్న నిరాశ‌, ఆందోళ‌న అభిమానుల్లో నెల‌కొంది. క‌నీసం 2019 సంక్రాంతి నాటికి అయినా 2.ఓ రిలీజ‌వ్వాల‌న్న‌ది అభిమానుల ఆకాంక్ష‌. కానీ అది నెర‌వేరుతుందో లేదో అన్న‌ది ఇప్ప‌టికైతే చెప్ప‌లేమ‌ని చెబుతున్నారు.