ఫ్రైడే రిలీజ్‌ : ముక్కోణ‌పు పోటీ?

Thursday, May 31st, 2018, 01:12:21 PM IST

ప్ర‌తి శుక్ర‌వారం రెండు మూడు సినిమాలు రిలీజ‌వుతున్నాయ్‌. వీటిలో ఏది స‌క్సెస్ ఏది ఫెయిల్ అన్న‌ది అటుంచితే ఏ సినిమా ఎక్కువ క్రేజుతో రిలీజ‌వుతోంది అన్న‌ది ఆస‌క్తిక‌ర పాయింట్‌. ఎప్ప‌టిలానే ఈ వారం ఓ మూడు సినిమాలు రిలీజ‌వుతున్నాయి. కింగ్ నాగార్జున న‌టించిన `ఆఫీస‌ర్‌`, విశాల్ నటించిన అభిమ‌న్యుడు, రాజ్‌త‌రుణ్ న‌టించిన రాజుగాడు రిలీజ్‌కి వ‌స్తున్నాయి. అయితే ఈ మూడు సినిమాల్లో దేనికీ అస‌లు ఆడియెన్‌లో ఎలాంటి ఆస‌క్తి లేక‌పోవ‌డం విశేషం.

గ‌త కొంత‌కాలంగా ఆర్జీవీ ఫ్లాపుల రికార్డ్ ఆఫీస‌ర్‌కి పెద్ద మైన‌స్ కానుంది. ఇక‌పోతే రాజ్‌త‌రుణ్ ప‌రిస్థితి ఇంచుమించు అదే. ఇటీవ‌ల రాజ్‌త‌రుణ్‌కి వ‌రుస ఫ్లాపులు రావ‌డంతో అత‌డి ఎంపిక‌ల‌పై ఆడియెన్‌కి న‌మ్మ‌కం పోయింది. దీంతో ఈ రెండు సినిమాల గురించి జ‌నం ఆలోచించ‌డ‌మే మ‌ర్చిపోయారు. ఇక‌పోతే విశాల్ న‌టించిన అభిమన్యుడు త‌మిళంలో ఇరుంబుతిరైగా రిలీజై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ప‌లు వివాదాస్ప‌ద అంశాల వ‌ల్ల హాట్ టాపిక్ అయ్యింది. అయితే తెలుగులో ఈ సినిమా ఏ స్థాయిలో ఆడుతుంద‌న్న‌ది వేచి చూడాల్సిందే. నేటి సాయంత్రం నుంచే ఈ సినిమాల ప్రివ్యూల సంద‌డి మొద‌ల‌వుతోంది కాబ‌ట్టి రిజ‌ల్ట్ నేటి రాత్రికే తేలిపోనుంది.