సీఎంగారు.. మీరు లాజిక్ మిస్సయ్యారు

Friday, June 14th, 2019, 07:53:33 AM IST

నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు హెచ్చరికలు చేయడం బాగా హాట్ టాపిక్ అయింది. 151మంది సంఖ్యా బలాన్ని కలిగిన వైకాపా టీడీపీని గ్యాప్ లేకుండా ఆదుకున్నారు. జగన్ అయితే ఒక్క ఐదుగురు ఎమ్మెల్యేలను లాగానంటే ఉన్న ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అంటూ హెచ్చరించారు. తాను తలుపు తెరిస్తే దూకడానికి టీడీపీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని అన్నారు. కానీ తాను ఫిరాయింపులను ప్రోత్సహించనని, టీడీపీ ఎమ్మెల్యేలు వైకాపాలోకి రావాలనుకుంటే పదవులకు రాజీనామాలు చేసే రావాలని అన్నారు.

కానీ టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం తాము పార్టీ మారేందుకు సిద్ధంగా లేమని అంటున్నారు. అయినా జగన్ చెప్పినట్టు టీడీపీ ఎమ్మెల్యేలు ఆయనతో సంప్రదింపుల్లో ఉంటే ఆయన పెట్టుకున్న సిద్ధాంతాల ప్రకారం రాజీనామా చేసే వారిలో కలవాలి. వైకాపాలో సంఖ్యా బలం తక్కువ ఉంటే రాజీనామాలు చేసి వెళ్లినా అధికార పార్టీలో ఉన్నాం కదా అని సర్దుకోవచ్చు. కానీ టీడీపీని వీడి వైకాపాలోకి వెళితే చివరి కుర్చీల్లో కూర్చోవాల్సి వస్తుందని, డమ్మీలుగా మారతామని ఎమ్మెల్యేలకు బాగా తెలుసు.

ఎన్నికల ముందు టీడీపీని వీడి వైకాపాలోకి వెళ్లిన నేతలనే జగన్ లెక్కచేయలేదు. అలాంటిది గెలిచి అధికారంలో ఉన్నప్పుడు వెళితే అసలు ఖాతరు కూడా చేయరనేది వాస్తవం. అధికార పార్టీలో ఉండి ఆఖరున నిలబడే కన్నా పదవితో ప్రతిపక్షంలో ఉండటమే ఉత్తమం. టీడీపీ ఎమ్మెల్యేలు ఈమాత్రం విషయాన్ని గ్రహించలేని మందబుద్ధులైతే కాదు. కానీ జగన్ మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు తన తలుపు బయట నిలబడి తెరిస్తే రాజీనామాలు చేయడానికి రెడీగా ఉన్నారని మాట్లాడటం ఎలా లాజిక్ అవుతుందో మరి.