ప్ర‌తి ప‌క్షం లేని తెలంగాణ అవ‌స‌ర‌మా?

Friday, June 7th, 2019, 10:13:31 AM IST

తెలంగాణ‌లో ఏం జ‌రుగుతోంది?. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసే చ‌ర్య‌లు తారా స్థాయికి చేరిపోయాయి. అఫ్‌కోర్స్ వైఎస్ వున్న స‌మ‌యంలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో ఓ ప‌క్క టీడీపీనీ మ‌రో ప‌క్క తెరాస‌ను చెడుగుడు ఆడుకున్నారు. అదే ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు మూలంగా మారింది. వైఎస్ నేర్పిన విద్య‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ టీడీపీ, కాంగ్రెస్‌ల‌పై సంధిస్తున్నారు. ఆ పార్టీల్ని ఖాలీ చేస్తున్నారు. తెలంగాణ సాధించ‌డం నా క‌ల అని అసాధ్య‌మైన ఆ క‌ల‌ను సుసాధ్యం చేసి జేజేఅందుకున్న కేసీఆర్ ఇప్పుడు ప్ర‌తి ప‌క్షం లేని, ప్ర‌శ్నించే వాడు లేని తెలంగాణ‌ను సృష్టించుకుంటున్నారా? అంటే గురువారం జ‌రిగిన చారిత్ర‌క సంఘ‌ట‌న ఇందుకు అద్దంప‌డుతోంది.

తెలంగాణ‌లో టీడీపీని నామ‌రూపాల్లేకుండా చేసిన కేసీఆర్ అదే త‌ర‌హా ఆప‌రేష‌న్‌ను కాంగ్రెస్‌పై ప్ర‌యోగించ‌డం మొద‌లుపెట్టారు. తెరాస అధినేత మైండ్ గేమ్‌తో జాతీయ పార్టీ విల‌విల‌లాడుతోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. అందులోని మెజారిటీ వ‌ర్గాన్ని తెరాస త‌మ‌వైపు తిప్పుకుండి దీంతో శాస‌న స‌భ‌లో కాంగ్రెస్ సీఎల్పీని విలీనం చేస్తూ గురువారం ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంతో శాస‌న స‌భ‌లో కాంగ్రెస్ ప్ర‌తిప‌క్ష హోదా కోల్పోయింది. అంటే శాస‌న స‌భ‌లో ప్ర‌శ్నించే గొంతుక లేద‌న్న‌మాట‌. విచిత్రం ఏమిటంటే తెరాస‌కు మిత్ర‌ప‌క్ష‌మైన ఎంఐఎం అసెంబ్లీలో తెరాస త‌రువాత అత్య‌ధిక స్థానాలున్న పార్టీగా నిలవ‌డం. ఈ తంతుని చూసిన రాజ‌కీయ విమ‌ర్శ‌కులు అస‌లు తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యం వుందా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.